జగ్గయ్యపేటలో సెంటిమెంటే గెలుస్తుందా ?

మిగిలిన నియోజకవర్గాల సంగతెలా ఉన్నా కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో మాత్రం ఓ విచిత్రమైన సెంటిమెంటు బలంగా పనిచేస్తోంది. అదేమిటంటే ఒకసారి ఓడిపోయిన నేత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేదు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఈ సెంటిమెంటు 1962 నుండి కంటిన్యు అవుతోంది.  

ఇంతకీ ప్రస్తుత విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున సిట్టింగ్ ఎంల్ఏగా శ్రీరామ్ తాతయ్య పోటీ చేశారు. వైసిపి నుండి మాజీ ఎంఎల్ఏ సామినేని ఉదయభాను రంగంలోకి దిగారు.  2009, 2014 ఎన్నికల్లో కూడా వీరిద్దరే ప్రత్యర్ధులు. ఆ రెండు ఎన్నికల్లోను తాతయ్యే గెలిచారు. అంటే ఈసారి కూడా గెలిచి తాతయ్య హ్యాట్రిక్ సాధించాలని అనుకుంటున్నారు. 1999, 2004లో రెండుసార్లు గెలిచి తర్వాత రెండుసార్లు ఓడిపోయారు సామినేని.

నిజానికి ఇద్దరికీ నియోజకవర్గంపై మంచి పట్టే ఉంది. కాకపోతే శ్రీరామ్ వైశ్య సామాజికవర్గానికి చెందిన నేత. నియోజకవర్గంలో వైశ్యుల మెజారిటీతో పాటు పట్టుకూడా ఉంది. దానికి తోడు కమ్మ సామాజికవర్గం మద్దతు ఎలాగూ దక్కుతుంది. దాంతో తాతయ్య రెండుసార్లు వరుసగా గెలిచారు. అదే సమయంలో అధికార పార్టీ ఎంఎల్ఏ హోదాలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి. దాంతో తన గెలుపు ఖాయమని తాతయ్య విశ్వాసంతో ఉన్నారు.

ఇక సామినేనికి కూడా నియోజకవర్గంలో గట్టి పట్టే ఉంది. కాకపోతే వైశ్య, కమ్మేతర సామాజికవర్గాల మద్దతు ఏ స్ధాయిలో దక్కిందన్నదే పాయింట్. ఇక్కడ బిసిలు, కాపులు, రెడ్లు,  ఎస్సీ,  బ్రాహ్మణ సామాజికవర్గాలు కూడా ఉన్నాయి. ఈ సామాజికవర్గాల మద్దతుతో పాటు ప్రభుత్వంపై మండిపోతున్న జనాల మద్దతు కూడా సంపూర్ణంగా దక్కితే సామినేని గెలుపు కూడా సాధ్యమే.  ఉదయభానే గెలుస్తారా ? లేకపోతే సెంటిమెంటే గెలుస్తుందా చూడాల్సిందే.