తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కొన్నాళ్ళ క్రితం రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నారు. ఏదో పేరుని కూడా రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నించారు. కొద్ది గంటల్లో రాజకీయ పార్టీ పెట్టడానికి సంబంధించిన ప్రకటన చేస్తారంటూ అభిమానులు ఎదురుచూశారు. తమిళనాట చాలామంది రాజకీయ ప్రముఖులు రజనీకాంత్ పార్టీలోకి దూకెయ్యాలని ప్రయత్నించిన క్షణాలవి.
అనూహ్యంగా రజనీకాంత్ అనారోగ్యం బారిన పడ్డారు. చిన్నపాటి అనారోగ్య సమస్యే. కానీ, ఆయన ఆసుపత్రిలో చేరారు. అది కూడా హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో. ఆ తర్వాత సీన్ మారిపోయింది. ‘నేనిక రాజకీయాల్లోకి రావడం కుదరదు.. నన్ను క్షమించమని కోరుతున్నా..’ అంటూ తమిళ ప్రజల్ని, అభిమానుల్ని ఉద్దేశించి రజనీకాంత్ వ్యాఖ్యానించారు.
ఏమయ్యింది.? ఎందుకిలా రజనీకాంత్ రాజకీయ పార్టీ విషయంలో వెనక్కి తగ్గారు.? అదైతే ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఔను, రజనీకాంత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అది కూడా దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. మూత్రపిండాల మార్పిడి జరిగింది ఆయనకి కొన్నేళ్ళ క్రితం. అయినాగానీ, ఆయన సినిమాల్లో నటిస్తూనే వున్నారనుకోండి.. అది వేరే విషయం.
తాజాగా, రజనీకాంత్ తమిళనాడు గవర్నర్‌తో భేటీ అవడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. రజనీకాంత్, గవర్నర్‌ని కలుస్తారన్న ప్రచారంతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాలు ఉలిక్కిపడ్డాయి. కానీ, రజనీకాంత్.. గవర్నర్‌ని కలిసిన అనంతరం, స్పష్టత ఇచ్చేశారు. తాను రాజకీయాల్లోకి రాబోవడంలేదనీ, గవర్నర్‌తో భేటీ కేవలం మర్యాదపూర్వకమేనని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.
సో, వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రజనీకాంత్ మద్దతిస్తారనే ప్రచారమైతే జరుగుతూనే వుంది.