PK Close Salaha To YSRCP : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమంటూ జరిగితే, ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీకీ ఆయన ‘వ్యూహాలు’ అందించబోరట. అంతే మరి, కాంగ్రెస్ పార్టీలో చేరాక కాంగ్రెస్ మనిషి అవ్వాల్సింది. కాంగ్రెస్ రాజకీయాలకు అలవాటు పడాల్సిందే. అప్పడిక కాంగ్రెస్ పార్టీతో ఏ పార్టీలైతే కలిసి వుంటాయో, ఆయా పార్టీలకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతితో ‘సలహాలు’ ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్‌కి వీలవుతుంది.
మరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. వీటి సంగతేంటి.?
అందుకే, ఆయా పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాలు పలుకుతోంది.. బీజేపీకి వ్యతిరేకంగా అంతా ఒక్కతాటిపైకి రావాలని. అలా ఏయే పార్టీలైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి కూటమి కడతాయో.. వాటికి మాత్రమే ప్రశాంత్ కిషోర్ సేవలు కొనసాగే అవకావం వుంది.
‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా, తెలంగాణ రాష్ట్ర సమితికి ఐ ప్యాక్ సేవలు కొనసాగుతాయి..’ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్‌తో ప్రశాంత్ కిషోర్ చెప్పారంటూ వార్తలు రావడాన్ని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆక్షేపించారు.
‘ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరాక, కాంగ్రెస్ నేతగా తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమినే కోరుకుంటారు.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మేమిద్దరం కలిసి ప్రెస్ మీట్ పెట్టి, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాం..’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.