జగన్ చర్యలు పార్టీకి లాభమా ? నష్టమా ?

పార్టీ క్షేమం కోసమే వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమన్వయకర్తలను మారుస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపునే ధ్యేయంగా పెట్టుకుని సమన్వయకర్తలను మారిస్తే తప్పేంటని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాను ఎదురు ప్రశ్నించారు.  ఈరోజు మీడియాతో మాట్లాడూతూ, సమన్వయకర్తలను మారిస్తే తప్పేం లేదని స్పష్టంగా చెబుతున్నారు. పెద్దిరెడ్డి చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజమే. అందులో తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. ఏ పార్టీ అయినా చేసేదదే.

 

అయితే, ఇక్కడే ఓ విషయాన్ని జగన్ అయినా పెద్దిరెడ్డి అయినా మరచిపోయారు. దాదాపు నాలుగున్నరేళ్ళ పాటు తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను అమలు చేసిన వారు జగన్ పిలుపు ప్రకారం ఆందోళన, నిరసన కార్యక్రమాలను నేతలు అమలు చేశారు. పార్టీ కోసమే రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. నాలుగున్నరేళ్ళ నేతల కష్టాలను కాదనగలరా ? అటువంటిది ఎన్నికలకు ముందు సమన్వయకర్తలుగా తొలగించి కొత్తవారిని నియమిస్తే అప్పటివరకు కష్టపడ్డ నేతలు, పార్టీనే నమ్ముకుని వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లను ఆశించిన నేతలకు జగనైనా పెద్దిరెడ్డైనా ఏం సమాధానం చెబుతారు ?

 

పార్టీ కోసం కష్టపడ్డవారిని కాదని కొత్తవారికి సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తే అప్పటి వరకూ కష్టపడ్డ నేతలు తమ మద్దతుదారులకు ఏమని సమాధానం చెప్పుకోవాలి ? అసలు చివరి నిముషంలో సమన్వయకర్తలుగా మార్చేస్తారని తెలిస్తే ఏ నేతైనా పార్టీ కోసం కష్టపడతారా ? వారు పడిన శ్రమ, ఖర్చు చేసుకున్న డబ్బుల మాటేంటి ? నిజంగా పార్టీ శ్రేయస్సు కోరే జగన్ సమన్వయకర్తలను మార్చేస్తుంటే మరి కొత్తవాళ్ళని నియమించటంలో అర్ధమేంటి ?

 

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నాలుగున్నరేళ్ళపాటు కష్టపడిన లేళ్ళ అప్పిరెడ్డి స్ధానంలో పార్టీలో కొత్తగా చేరిన చంద్రగిరి ఏసురత్నాన్ని ఏ ప్రాతిపదికన నియమించారు.  చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ ను కాదని విడదల రజనీకుమారిని నియమించారు. లేళ్ళకన్నా ఏసురత్నం ఏ విధంగా మెరుగైన అభ్యర్ధి ? మర్రి కన్నా విడదల ఏ విధంగా మెరుగు ? ఈ ప్రశ్నలకు సమాధానం పెద్దిరెడ్డి చెప్పగలరా ?  ఇటువంటి చర్యలతో జగన్ లాభపడటం అటుంచి నష్టాన్ని మూటకట్టుకోవాల్సొస్తుందేమో ?