అయ్యన్న పాత్రుడి బూతుల్ని నారా లోకేష్ ఖండించగలరా.?

అబ్బో, మాజీ మంత్రి నారా లోకేష్.. మీడియా ముందుకొచ్చేసి.. చాలా పద్ధతులు మాట్లాడేశారు. మహిళల్ని ఎలా గౌరవించాలో, రాజకీయ నాయకులు బూతులెందుకు మాట్లాడకూడదో చెప్పేశారు. మంచిదే, ‘సుద్దులు’ ఎవరు చెప్పినా స్వాగతించాల్సిందే. కానీ, టీడీపీ నేతలు మాట్లాడుతున్న బూతుల మాటేమిటి.?

ఓ పట్టాభి, ఓ అయ్యన్న పాత్రుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే, బూతు భాషలో ప్రావీణ్యం సంపాదించుకున్న నాయకులు తెలుగుదేశం పార్టీలోనూ చాలామందే వున్నారు. ముఖ్యమంత్రి మీద అత్యంత జుగుప్సాకరమైన రీతిలో బూతులు తిట్టిన పట్టాభి, తెలుగుదేశం పార్టీ నాయకుడే కదా.?

వైఎస్ జగన్ మోహర్ రెడ్డిని నిత్యం బూతులు తిట్టే అయ్యన్న పాత్రుడిదీ తెలుగుదేశం పార్టీనే కదా.? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్, ఎందుకు అయ్యన్న పాత్రుడినిగానీ, పట్టాభినిగానీ కంట్రోల్ చేయలేకపోతున్నట్టు.?

తనదాకా వస్తేనేగానీ, తలనొప్పి సంగతి తెలియదన్నట్టు.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, చంద్రబాబుపైనా తనపైనా బూతులు తిట్టడం పట్ల నారా లోకేష్ తెగ ఆవేదన చెందేశారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారాయణ స్వామి బూతులు తిట్టడాన్నీ తప్పు పట్టారు నారా లోకేష్.

గోరంట్ల మాధవ్ అయినా, నారాయణ స్వామి అయినా.. అలా మాట్లాడి వుండకూడదు. వారి తీరుని తప్పు పట్టాల్సిందే. కానీ, గతంలో చట్ట సభల్లో బొండా ఉమామహేశ్వరరావు, అప్పట్లో వైసీపీ మహిళా నేత రోజాపై వాడిన బూతు పదజాలం మాటేమిటి.?

గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్టు.. ఈ బూతుల రాజకీయంలో టీడీపీ కూడా వుందనే విషయం నారా లోకేష్ మర్చిపోవడం శోచనీయం.