ఇద్దరు చంద్రులతో పాటు జగన్ కూడా యూపిఏలోనే చేరుతారా ? అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ . రాబోయే ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విచిత్రమేమిటంటే చింతమోహన్ చెబుతున్నట్లుగా పై ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా ప్రస్తుతానికి యూపిఏలో లేరు.
క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు, లాజికల్ గా ఆలోచిస్తే ముగ్గురు కలిసి ఒకే కూటమిలో ఉండటానికి దాదాపు అవకాశాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే, చంద్రబాబునాయుడు, కెసియార్ లకు చుక్కెదురు. అలాగే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం పడదు. రేపటి ఫలితాల్లో అధికారంలోకి వైసిపి వస్తే చంద్రబాబుపై ఎన్ని కేసులు పడతాయో ? ఎన్ని విచారణలను ఎదుర్కోవాలో ? ఎవరూ చెప్పలేరు.
చంద్రబాబు, కెసియార్, జగన్, చంద్రబాబు మధ్య వైరం రాజకీయంగా కాక వ్యక్తిగతంగా పెరిగిపోయింది. కెసియార్, జగన్ కు కామన్ శతృవు చంద్రబాబు. కాబట్టే పై ఇద్దరు చంద్రబాబు ఎక్కడ దొరుకుతారా ? ఎక్కడ దొరికిచ్చుకుందామా ? అని ఎదురు చూస్తున్నది వాస్తవం. ఇలాంటి పరిస్దితుల్లో చంద్రబాబు ఉండే కూటమిలో కెసియార్, జగన్ చేరుతారన్నది అనుమానమే.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ తో అంటకాగుతున్నారే కానీ చంద్రబాబు యూపిఏలో మాత్రం చేరలేదు. రేపటి కౌంటింగ్ లో ఇటు కెసియార్ అటు జగన్ కే మ్యాగ్జిమమ్ పార్ల మెంటు సీట్లు వస్తే నిజానికి రాహూల్ కు చంద్రబాబుతో ఏం పనుంటుంది ? అధికారం కోల్పోయినా, ఏ ఒకటి రెండు ఎంపి సీట్లు తెచ్చుకున్నా చంద్రబాబును జాతీయ రాజకీయాల్లో ఎవరూ పట్టించుకోరన్నది వాస్తవం. మరి ఏ లెక్కలో చింతా మోహన్ చెప్పారో అర్ధం కావటం లేదు.