చంద్రబాబుకు అంత ధైర్యముందా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడిని విమర్శించేంత ధైర్యం చంద్రబాబునాయుడుకు ఉందా అన్నదే ఇపుడందరిలో మొదలైన ప్రశ్న. రాజధాని అమరావతి నిర్మాణానికి అప్పు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచబ్యాంకు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.  తమ నిర్ణయానికి కేంద్రప్రభుత్వ వైఖరే కారణమని ప్రపంచబ్యాంకు కమ్యూనికేషన్స్ వింగ్ తాజాగా ప్రకటించింది.

అప్పు విషయంలో ప్రపంచబ్యాంకు నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరే కారణమంటూ చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు ఎల్లో మీడియా కూడా నాలుగు రోజులుగా విషప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారాన్ని తెలుసుకున్న ప్రపంచబ్యాంకు తన క్లారిఫికేషన్ ఇచ్చింది. దాంతో విషప్రచారానికి భిన్నంగా ప్రపంచబ్యాంకు ప్రకటన ఉండటం చంద్రబాబు, ఎల్లో మీడియాకు మింగుడుపడటం లేదు.

అదే సమయంలో తన నిర్ణయానికి కేంద్రప్రభుత్వ వైఖరే కారణమని వరల్డ్ బ్యాంకు స్పష్టంగా ప్రకటన చేసిన నేపధ్యంలో మరి చంద్రబాబు ప్రధానమంత్రి వైఖరి పైన కూడా మాట్లాడాలి కదా ?  జగన్ పై మాట్లాడినట్లే ఇపుడు మోడిపైన కూడా చంద్రబాబు మాట్లాడుతారా ? అన్నదే తాజా ప్రశ్న.

మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మళ్ళీ మోడికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకూ మోడిపై చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా తనకు అత్యంత సన్నిహితులైన టిడిపి రాజ్యసభ సభ్యులను బిజెపిలోకి ఫిరాయించేట్లు చేశారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ప్రపంచ బ్యాంకు తాజా ప్రకటనపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.