సెన్సేషనల్ న్యూస్: 2019 ఎన్నికల బరిలోకి ధోని, గౌతమ్ గంభీర్

2019 ఎన్నికల్లో ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు బరిలోకి దిగనున్నాయా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కధనాన్ని ప్రముఖ ఆంగ్లపత్రిక ప్రధానంగా ప్రచురించింది. రానున్న ఎన్నికల్లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ధోని, గౌతమ్ గంభీర్ బీజేపీ తరపున పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాలు కింద చదవండి.

ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్ లో లోక్ సభ స్థానానికి ఆయనను పోటీ చేయించాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం. ఇక పోటీ క్రికెట్ నుండి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకపోయినా గౌతమ్ గంభీర్ కి దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ని బీజేపీ వాడుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

సండే గార్డియన్ నివేదిక ప్రకారం ఢిల్లీ పార్లమెంటు స్థానానికి మీనాక్షి లేఖి స్థానంలో గౌతమ్ గంభీర్ ని బరిలోకి దింపనున్నట్టు సమాచారం. పార్టీ అంతర్గత వర్గాలు లేఖి పని తీరుతో అసంతృప్తిగా ఉన్న కారణంగా ఆమె స్థానంలో గౌతమ్ గంభీర్ ను రంగంలోకి దించనున్నారని తెలుస్తోంది.

గ్రౌండ్ రిపోర్ట్స్ ద్వారా మీనాక్షి లేఖి నాయకత్వంతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు తేలింది. అందుకే మరోసారి అదే స్థానం నుండి మీనాక్షి లేఖిని బరిలోకి దింపకూడదని అధిష్టానం నిర్ణయించుకుంది. అంతేకాదు…దెస వ్యాప్తంగా గౌతమ్ గంభీర్ కు ప్రజాదరణ ఉంది. సేవ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంతగానో చేరువయ్యాడు గంభీర్. అందునా గంభీర్ స్వస్థలం ఢిల్లీ. ఈ కారణంగా లేఖి స్థానంలో గంభీర్ ని దింపితే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ సీనియర్ ఒకరు తెలిపినట్టు నివేదికలో వెల్లడైంది.

ఇక ధోనిని సైతం 2019 ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచనలో బీజేపీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ధోనిని ఈ విషయంపై కన్విన్స్ చేయడానికి ఇప్పటికే బీజేపీ ప్రయత్నాలు మొదలెట్టింది. దేశవ్యాప్తంగా ఈ ఇద్దరు క్రికెటర్లకు ఉన్న క్రేజ్ ను ఎలాగైనా రానున్న ఎన్నికల్లో బీజేపీ వినియోగించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. జాతీయ స్థాయిలో వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని ప్రచారానికి వాడుకుని పార్టీని గెలిపించుకోవాలని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.