తమ్ముడు పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడా ? ఇపుడదే సందేహం అందరిలోను మొదలైంది. సినీరంగానికి సంబంధించి చిరంజీవి అడుగుజాడల్లోనే నడిచారంటే తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఎవరో ఒకరు ముందుండి జూనియర్లను నడిపించాలి కాబట్టి. మరి రాజకీయాల్లో కూడా చిరంజీవి అడుగుజాడల్లోనే నడుస్తున్నారన్న అనుమానం వస్తే మాత్రం పవన్ రాజకీయ భవిష్యత్తు కచ్చితంగాగా ఇబ్బందులు పడినట్లే.
సినీరంగంలో మెగాస్టార్ అనిపించుకున్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం ఫెయిల్యూరనే చెప్పాలి. 2009లో ప్రజారాజ్యంపార్టీని పెట్టిన చిరంజీవి ఆ ఎన్నికల్లో సాధించింది కేవలం 16 అసెంబ్లీ సీట్లు మాత్రమే. అప్పటి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలు తిరుపతి, పాలకొల్లులో పోటీ చేసిన చిరంజీవి స్వయంగా సొంతజిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓడిపోవటం చాలా అవమానం క్రిందే లెక్క. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చిరంజీవి పిఆర్పిని కాంగ్రెస్ లో విలీనం చేసేసి రాజ్యసభ సీటు తీసుకుని కేంద్రమంత్రైపోయిన విషయం అందరికీ తెలిసిందే. అంటే పార్టీపెట్టి కనీసం ఐదేళ్ళు కూడా సొంతంగా నడపలేకపోయారు.
ఇదంతా ఒక ఎత్తైతే పార్టీ పెట్టినప్పటి నుండి టిక్కెట్ల కేటాయింపులో అనేక ఆరోపణలు వెలుగుచూశాయి. చాలా అసెంబ్లీ, ఎంపి టిక్కెట్లను అమ్ముకున్నారంటూ చాలా రచ్చే జరిగింది. టిక్కెట్ల కేటాయింపును చిరంజీవితో పాటు ఆయన బావ అల్లు అరివింద్, సోదరులు నాగుబాటు, పవన్ కల్యాణ్ తదితరుల జోక్యం ఎక్కువైపోయిందనే ఆరోపణలకైతే కొదవేలేదు. అంటే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయింపు జరగలేదు, పోటీ చేయనేలేదు. కానీ టిక్కెట్లను అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు పిఆర్పిని బాగా దెబ్బతీశాయి.
ఇపుడు కూడా సేమ్ టు సేమ్ ఆరోపణలు జనసేన విషయంలో మొదలయ్యాయి. ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే జనసేన అధినేత పవన్ స్వయంగా డబ్బుల వసూళ్ళకు తెరలేపారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నది. హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఎంపిక చేసిన ఓ 150 మందిని పిలిపించి తలా రూ. 15 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు కలకలం రేపింది. ఆ ఆరోపణలు నిజమే అయితే జనసేన మరో పిఆర్పి అయిపోవటానికి ఎంతో కాలం పట్టదు.