కడప గడపలో జనసేనకు డిపాజిట్లు వస్తాయా.?

ఉమ్మడి కడప జిల్లాకి చెందిన జనసైనికుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ప్రయత్నిస్తున్నారు. ఆ జిల్లాకి చెందిన నేతలతో భేటీ అయ్యారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో గత మూడేళ్ళ కాలంలో 132 మంది కౌలు రైతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారన్నది నాదెండ్ల మనోహర్ ఆరోపణ. జనసేన పార్టీ, అలాంటి కౌలు రైతుల కుటుంబాల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిందనీ, జనసేనాని తన వ్యక్తిగత సొమ్ముని కౌలు రైతుల కుటుంబాల కోసం ఖర్చు చేస్తున్నారనీ నాదెండ్ల మనోహర్ చెప్పారు.

ఉమ్మడి కడప జిల్లాలో జనసేన కోసం పనిచేసే నిఖార్సయిన జనసైనికులున్నారనీ, జనసేన నాయకులు నిబద్ధతతో పనిచేస్తున్నారనీ, అక్టోబర్‌లో జనసేనాని ప్రారంభించబోయే రాష్ట్ర వ్యాప్త యాత్రతో రాజకీయ సమీకరణాలు మారిపోతాయనీ నాదెండ్ల మనోహర్ అంటున్నారు.

అంతా బాగానే వుందిగానీ, ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడైనా జనసేన పార్టీకి కనీసం డిపాజిట్లు అయినా వస్తాయా.? అన్నది వైసీపీ నుంచి దూసుకొస్తున్న ప్రశ్న. కడప జిల్లా బద్వేలులో కావొచ్చు, చిత్తూరు జిల్లా తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో కావొచ్చు.. ఉప ఎన్నికలు వస్తే జనసేన ఏం చేసింది, తప్పించుకు తిరిగింది.!

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలోగానీ, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలోగానీ జనసేన పోటీ చేసి వుంటే, ఆ పార్టీకి తన బలమేంటో తెలిసి వుండేది.!