BJP Seek YSRCP : తెలంగాణలో వైసీపీ సాయాన్ని బీజేపీ కోరబోతోందా.?

BJP Seek YSRCP

BJP Seek YSRCP : రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎవరెప్పుడు ఎవరితో చేతులు కలుపుతారో చెప్పడం కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ నాయకులే కాదు, రాజకీయ పార్టీలు కూడా కప్పల తక్కెడ వ్యవహారంలోకి మారిపోయాయ్.

అసలు విషయంలోకి వస్తే, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముందస్తు ఊహాగానాలు వినిపిస్తున్నా, ఏమో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంత రిస్క్ చేస్తారా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. తెలంగాణ వరకూ మాత్రం ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని బీజేపీ బలంగా నమ్ముతోంది. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుని కూడా పొందాలనుకుంటోందట బీజేపీ.

తెలంగాణలో అసలంటూ లేని వైఎస్సార్సీపీ మద్దతుని బీజేపీ ఎలా పొందగలుగుతుంది.? అంటే, వైసీపీ లేకపోయినా.. ఆ పార్టీ మద్దతుదారులైతే వున్నారు తెలంగాణలో. వాళ్ళలో కొందరు షర్మిలకు చెందిన వైఎస్సార్ తెలంగాణ పార్టీతో వుంటే, కొందరు తెలంగాణ రాష్ట్ర సమితి వైపు వున్నారు. అలాంటివాళ్ళందర్నీ ఒక్కతాటిపైకి తెచ్చి, బీజేపీ వైపు మళ్ళిస్తే ఎలా వుంటుందన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోందట.

ఈ వైసీపీ అనుకూల ఓటు బ్యాంకు మీద గులాబీ పార్టీకి కూడా కన్నుంది. మరోపక్క, అదే తమ ఆస్తి అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ భావిస్తోంది. ఇంత రాజకీయ గందరగోళం నడుమ, బీజేపీ ఎందుకు ఆ ఓటు బ్యాంకుపై నమ్మకం పెట్టుకుందన్నది ఓ ఆశ్చర్యకరమైన ప్రశ్న.

అయితే, మొన్నామధ్య జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఈ వైసీపీ ఓటు బ్యాంకు బీజేపీ వైపు పడిందట. అదే నమ్మకంతో బీజేపీ ఇంకోసారి అదే వైసీపీని అసెంబ్లీ ఎన్నికలకోసం బతిమాలుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనేముంది.?