పవన్ కళ్యాణ్‌పై పోటీకి అలీని దింపబోతున్నారా.?

సినీ నటుడు అలీ వైసీపీలో మరింత యాక్టివ్ అవబోతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఇటీవల అలీని వైఎస్ జగన్ సర్కారు నియమించిన సంగతి తెలిసిందే. కుమార్తె పెళ్ళి పనుల్లో బిజీగా వున్న అలీ, ఆ వ్యవహారాలు ముగియడంతో, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా బాధ్యతల్ని బాధ్యతాయుతంగా చేపడ్డంతోపాటుగా, పార్టీ పరమైన కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనబోతున్నారట.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదకు అలీని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇకపై పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శలు చేసేందుకు ఇప్పటిదాకా పనిచేస్తోన్న వైసీపీ ముఖ్యనేతలతోపాటు, అలీకి కూడా ప్రత్యేక బాధ్యతలు ఇవ్వనున్నారట.

అంతే కాదు, అలీని పవన్ కళ్యాణ్ మీద పోటీకి నిలబెట్టేందుకు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని ఎప్పటినుంచో అలీ అనుకుంటున్నా, అది కుదరడంలేదు. గతంలో రాజమండ్రి నుంచి పోటీ చేసేందుకు అలీ టీడీపీ ద్వారా ప్రయత్నించారు. టిక్కెట్ దొరక్కపోవడంతోనే ఆయన వైసీపీలో చేరారు.

పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి గెలిస్తే మంత్రి పదవి.. ఒకవేళ గెలవకపోతే, ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవి ఇవ్వాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అలీకి ఇప్పటికే సమాచారం అందిందని కూడా అంటున్నారు.