వారాహి యాత్రపై వైసీపీ ఎందుకు కంగారు పడుతోంది.?

మంత్రులు, ఎమ్మెల్యేలు.. గుంపులు గుంపులుగా వచ్చి మరీ వారాహి యాత్ర మీద విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సీజన్ షురూ అవుతున్న దరిమిలా, రాజకీయ పార్టీలు, నాయకులు జనంలో వుండాలనుకోవడంలో వింతేముంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘వారాహి యాత్ర’ ద్వారా జనంలోకి వెళతామంటున్నారు. ‘వై నాట్ 175’ అనే ధీమాతో వున్న వైసీపీ, వారాహి యాత్ర మీద విమర్శలు చేసి, సాధించేదేమీ వుండదు. దాని వల్ల జనసేన పార్టీకి అడ్వాంటేజ్ తప్ప, వైసీపీకి లాభమేమీ వుండదన్న విషయం వైసీపీ అధినాయకత్వం తెలుసుకోకపోతే ఎలా.?

ప్రభుత్వ పెద్దల మనసుల్ని గెలుచుకునేందుకు, కొందరు పోలీసు ఉన్నతాధికారులు ‘వారాహి యాత్ర’ విషయమై లేనిపోని ఆంక్షలు పెడుతున్నారన్న సంకేతాలు జనంలోకి వెళుతున్నాయి. గతంలో లోకేష్ పాదయాత్ర విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే అభాసుపాలయ్యింది.

ఓ పది రోజుల కాల్షీట్లు రాజకీయానికి ఇచ్చిన జనసేనాని, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్ చేసే రాజకీయ విమర్శలకు, వైసీపీలోని కింది స్థాయి నేతలు సమాధానమిస్తే సరిపోతుంది. కానీ, మంత్రులు కంగారు పడుతుండడమే శోచనీయం.

అన్నట్టు, పవన్ కళ్యాణ్‌కి అందుబాటులో ఆయన సినిమాలకు సంబంధించిన షూటింగులు వుండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారట ఆయా సినిమాల దర్శక నిర్మాతలు. ఆ సినిమా షూటింగ్ హంగామా ఓ వైపు.. ఈ పొలిటికల్ షూటింగ్ హంగామా ఇంకో వైపు.. జనానికే అన్నీ అర్థమవుతాయ్.. అధికార పార్టీ కంగారు పడాల్సిన పనే లేదు.!