ఎన్నికలకు ముందర ‘ముందస్తు సర్వేల అంచనాలు’ మామూలే. ఏ పార్టీ అధికారంలో వున్నా, సొంత సర్వేలు చేయించుకుంటుంది. దానికి అదనంగా పెయిడ్ సర్వేలూ జరుగుతాయి. ప్రముఖ సంస్థలూ నిస్సిగ్గుగా తమ సర్వేల అంచనాల్ని అమ్మేసుకుంటాయి, ‘ఆల్ట్రేషన్’ తప్పనిసరి.!
అధికార పార్టీల్ని ప్రసన్నం చేసుకోవడానికి సర్వేల సంస్థలు పడుతున్న పాట్లు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలాకాలంగా జరుగుతోంది ఈ తంతు.! మరి, సర్వే సంస్థల విశ్వసనీయత సంగతేంటి.? అంటే, వాటికి ఎప్పుడో విశ్వసనీయత పోయింది. వాటిని ఎవరూ నమ్మడంలేదు కూడా.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అంతకు ముందొచ్చిన సర్వేల అంచనాలు.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.. అన్నీ పెయిడ్ సర్వేలేనని అనడానికి.! వాస్తవ సర్వే అంచనాలు వుండవా.? అంటే, వుంటాయ్.. వాటికి మళ్ళీ మార్పులు చేర్పులు జరుగుతాయ్.. పిండి కొలదీ రొట్టి.. అన్నట్టు, పేమెంట్‌కి తగ్గట్టుగా రిజల్ట్ అన్నమాట.
తాజాగా ఓ సర్వే బయటకు వచ్చింది. 120 సీట్లను ఆ సర్వే వైసీపీకి కట్టబెడుతోంది. ఈ సర్వే అంచనా చూసి వైసీపీ చంకలు గుద్దుకుంటోంది. అదేంటీ, వైనాట్ 175 కదా వైసీపీ నినాదం.? అంటే, అదంతే.! ఎలాగోలా మళ్ళీ అధికారంలోకి వస్తే చాలనుకుంటోంది ఇప్పుడు. ఇదీ వాస్తవ పరిస్థితి.
టీడీపీ, జనసేన నుంచి మొత్తంగా నలుగురు మాత్రమే అభ్యర్థులు ఖరారయ్యారు. వైసీపీ, ఇప్పటికే సగానికి పైగా అభ్యర్థుల్ని ఖరారు చేసేసింది. గ్రౌండ్ లెవల్‌లో ప్రజా వ్యతిరేకత వుంది వైసీపీకి. కానీ, టీడీపీ – జనసేన మధ్య ఇంకా కింది స్థాయిలో సఖ్యత సరిగ్గా సెట్ అవలేదు.
ఈ పరిస్థితుల్లో మామూలుగా అయితే వైసీపీకే ఎడ్జ్ వుండాలి. కానీ, ఆ ఎడ్జ్ కనిపించడంలేదు. దానికి తోడు ఈ ఫేక్ సర్వేల దందా, వైసీపీకి మరింత నెగెటివ్ అవుతోంది.! ఈ తరహా సర్వేల్ని బయట నుంచి చేయించి వదిలెయ్యక, పార్టీ అధికారిక హ్యాండిల్ నుంచి వీటికి ప్రచారం కల్పిస్తే.. దాని వల్ల వైసీపీకి జరిగే మంచి కంటే, చెడు చాలా చాలా ఎక్కువని వైసీపీ అధినాయకత్వం ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో.!