వైఎస్సార్సీపీ సీమ ప్రజా ప్రతినిథులెందుకు రాజీనామా చేయలేదు.?

తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ ‘గర్జన’ జరిగింది. మొన్నామధ్య మూడు రాజధానుల కోసమంటూ విశాఖలో గర్జన జరిగింది కదా.! అచ్చం అదే తరహా గర్జన, ఈసారి తిరుపతిలో నడిచింది. అప్పట్లో ఉత్తరాంధ్ర మేధావులు.. ఇప్పుడేమో రాయలసీమ మేధావులు.. వెరసి.. వైసీపీ కనుసన్నల్లోనే ఈ గర్జన కూడా జరిగిందన్నమాట.

ఏరీ విశాఖలో కన్పించిన వైసీపీ నేతలు మంత్రులు.? అందునా, రాయలసీమకి చెందిన మంత్రులెందుకు ఈ ఆత్మగౌరవ గర్జనకు హాజరు కాలేదు.? వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తంగా రాయలసీమ ఆత్మగౌరవమని అంటున్నారు.. కర్నూలుకి హైకోర్టు సహా న్యాయ రాజధాని రావాల్సిందేనని నినదించారు.. సోకాల్డ్ మేధావులు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా రాయలసీమకు చెందిన వ్యక్తే. ఆయన కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే. అలాంటప్పుడు, ఆయన కూడా తన సొంత ప్రాంతం ఆత్మగౌరవం కోసం నినదించాలి కదా.? అన్న చర్చ జరుగుతోంది. సరే, ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతవరకు సబబు.? అనేది మళ్ళీ వేరే వ్యవహారం.

మంత్రి ధర్మాన ప్రసాదరావు మూడు రాజధానుల కోసం రాజీనామాకు సిద్ధమయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అయితే రాజీనామా లేఖని మీడియాకి చూపించారు, ఉత్తరాంధ్ర మేధావులకూ అందించారు దాన్ని. మరి, ఆపాటి బాధ్యత, తెగువ.. రాయలసీమకి చెందిన వైసీపీ ప్రజా ప్రతినిథుల్లో ఎందుకు లేకుండా పోయింది.?

నిజానికి, తిరుపతి గర్జనకు జనం బాగానే తరలి వచ్చారు. కానీ, నాయకులే కనిపించలేదు. కనిపించడం కాదు, ఎగ్గొట్టారంతా.! ఇదీ తమ ప్రాంతంపై రాయలసీమ ప్రజా ప్రతినిథులకున్న చిత్తశుద్ధి.!