బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని విమర్శించాలనుకుంటే, వైసీపీ నేరుగానే విమర్శించొచ్చు. ఇందులోకి చంద్రబాబు పేరుని వైసీపీ ఎందుకు లాగుతున్నట్టు.? వైసీపీ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాల్లో ఇది కూడా ఒకటి.!
ఎవర్ని వైసీపీ విమర్శించాలనుకున్నాగానీ, చంద్రబాబు పేరుని లింక్ చేసెయ్యడం కొందరు వైసీపీ నేతలకు అలవాటైపోయింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఇవేవీ పట్టించుకోవడంలేదా.? అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకంటూ కొన్ని బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతల నిర్వహణలో ఆయన బిజీగా వుంటారు.
పార్టీ వ్యవహారాల్ని పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి పాత్ర చాలా తక్కువైపోయింది. వైవీ సుబ్బారెడ్డి సంగతి సరే సరి.! సజ్జల రాసిస్తున్న స్క్రిస్టులో, చంద్రబాబు ప్రస్తావనే ప్రతిసారీ వస్తోంది. పవన్ కళ్యాణ్‌ని విమర్శించడానికైనా, జేపీ నడ్డాని విమర్శించడానికైనా.. చంద్రబాబు పేరే వైసీపీ ఎందుకు ప్రస్తావిస్తోందో ఏమో.! ఈ చర్యల ద్వారా చంద్రబాబుకి వైసీపీ జాకీలేసి, ఆయన ఇమేజ్‌ని పెంచుతున్నట్టుగా వుంది.
వైసీపీకి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అంటే టీడీపీనే. ఆ లెక్కన, టీడీపీని విమర్శించడం వైసీపీకి మామూలే కావొచ్చు. కానీ, జేపీ నడ్డాని కూడా చంద్రబాబు ప్రభావితం చేయగలరని వైసీపీ ఇస్తున్న సంకేతాలు, వైసీపీకే నష్టం చేకూర్చుతాయి.
బీజేపీ తెరవెనుకాల సహాయ సహకారాలు అందిస్తూ, నడ్డాని విమర్శించలేక.. విమర్శిస్తున్నట్టుంది వైసీపీ తీరు.!