కన్నా లక్ష్మినారాయణ విషయంలో వైసీపీ అత్యుత్సాహమేల.?

మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ బీజేపీ నుంచి టీడీపీలోకి దూకేసిన విషయం విదితమే. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కన్నా లక్ష్మినారాయణ, వైసీపీలో చేరాల్సి వున్నా.. అనూహ్యంగా 2019 ఎన్నికలకు ముందు బీజేపీలోకి దూకారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడయ్యారు కూడా. అసలు కన్నా లక్ష్మినారాయణకు వున్న ఫాలోయింగ్ ఎంత.? రాజకీయంగా ఆయన అనుభవం ఏపాటిది.? ఇవన్నీ వైసీపీకి తెలియనివేమీ కావు. నిజానికి, కన్నా లక్ష్మినారాయణను వైసీపీ పట్టించుకోకపోవడమే మంచిది. కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు.. వైసీపీ నుంచి పోటీ పడ్డారు కన్నా లక్ష్మినారాయణపై విమర్శలు చేసేందుకు.

ఎడా పెడా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ కన్నా లక్ష్మినారాయణపై కొడాలి నాని, అంబటి రాంబాబు తదితరులు ఘాటైన విమర్శలు చేసేశారు. ఈ వ్యవహారమిప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వైసీపీ అధినేత మీద కన్నా లక్ష్మినారాయణ విమర్శలు చేశారు కాబట్టి, వైసీపీ నుంచి కౌంటర్ ఎటాక్ వచ్చిందనుకోవడం కొంతవరకు సబబే.

కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసి.. రాజకీయంగా తన పరపతి పెంచుకోవాలని కన్నా లక్ష్మినారాయణ చూశారు. ఆ కన్నా లక్ష్మినారాయణ మీద విమర్శలు చేస్తే, కొడాలి నానికి కావొచ్చు.. అంబటి రాంబాబుకి కావొచ్చు.. పరపతి పెరుగుతుందా.? ఛాన్సే లేదు. కింది స్థాయి నేతలతో కన్నా లక్ష్మినారాయణ విమర్శలకి వైఎస్ జగన్ కౌంటర్ ఇప్పించి వుంటే సరిపోయేది.! కానీ, అనూహ్యంగా కన్నాకి వైసీపీ నుంచే ఎలివేషన్లు వచ్చినట్లయ్యింది.