రాజ్యసభ రేసులో తెలంగాణ కోటా: జగన్ వ్యూహమేంటి.?

YS Jagan :ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్ళే అవకాశం వస్తే, ఆ నలుగురిలో ఇద్దరు బీసీలు, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారిని ఎంపిక చేయడం వరకూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆక్షేపించడానికేమీ లేదు.

కానీ, తెలంగాణ కోటాలో.. అన్నట్టు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరికి ఏపీ కోటాలో రాజ్యసభకు వైసీపీ అధినేత పంపనుండడమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి కూడా.

ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రాజ్యసభ సభ్యుల విషయమై ప్రత్యేకమైన వ్యూహాల్ని అనుసరిస్తుంటుంది. అనుసరించాలి కూడా.

తమ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలు వ్యవహరించాలి. అయితే, ఇతర రాష్ట్రాలకు చెందినవారికి ఆయా రాష్ట్రాలు తమ కోటాలో రాజ్యసభకు వెళ్ళే ఛాన్స్ ఇవ్వకూడదన్న రూల్ ఏమీ లేదు. వెంకయ్యనాయుడు గతంలో వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్ళారు.

ప్రస్తుత బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా వేరే రాష్ట్రం నుంచే రాజ్యసభకు వెళ్ళిన సంగతి తెలిసిందే.

అయితే, ఇతర రాష్ట్రాల పరిస్థితులు వేరు. ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు వెళ్ళే ఏపీ నేతలు, సొంత రాష్ట్రం మీద పెద్దగా శ్రద్ధ పెట్టరన్న విమర్శ వుంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యసభ పరంగా తగిన ప్రాధాన్యత వుండి తీరాల్సిందే.

ఆర్ కృష్ణయ్య కావొచ్చు, నిరంజన్ రెడ్డి కావొచ్చు.. ఈ ఇద్దరూ తెలంగాణ వారే గనుక, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఏదన్నా సమస్యపై రాజ్యసభలో ఓటింగ్ జరిగితే, దాన్ని తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకించే సందర్భం వుంటే.. అప్పుడేమవుతుంది.? ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్ళే కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి ఎవరికి ఓటేస్తారు.? ఈ ప్రశ్న చుట్టూ చాలా అనుమానాలు తలెత్తుతున్నాయ్. వైసీపీ ఈ విషయమై స్పష్టత ఇస్తుందా.?