వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు అధికంగా విమర్శలకు గురైంది మాత్రం దేవుడి విషయంలోనే. అందునా టీటీడీకి సంబంధించిన పలు అంశాల్లో వైసీపీ మీద విమర్శల వర్షం కురిసింది. జగన్ అన్యమతస్థుడు కాబట్టి బీజేపీ దాన్ని అడ్డం పెట్టుకుని కొంత హంగామా చేసింది. దేవాలయాల మీద దాడుల వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలని అనేక రకాలుగా ప్రయత్నం చేసింది. జగన్ ఉద్దేశ్యపూర్వకంగానే హిందూ మతం మీద దాడులు చేయిస్తున్నారని, రాష్ట్రంలో హిందూ దేవుళ్ళకు రక్షణ లేకుండా పోయిందని నానా యాగీ చేశారు. మొదట్లో అది కొంత ఉధృతంగానే సాగినా తర్వాత చల్లబడిపోయింది. కానీ శ్రీవారి విషయంలో మాత్రం వైసీపీ స్వయంకృతాపరాధాలే ఎక్కువగా ఉన్నాయి.
శ్రీవారి ఆస్తులు కొన్ని అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటిని కాపాడలేమని అంటూ టీటీడీ పాలకమండలి ఆ ఆస్తుల విక్రయానికి పూనుకుంది. దాంతో దేవుడికి భక్తులు ఎంతో భక్తితో ఇచ్చిన ఆస్తులను అమ్మడం ఏమిటని భక్తులు ముక్కున వేలేసుకున్నారు. అలాగే డిక్లరేషన్ విషయంలో ప్రత్యర్థి పార్టీలు ఎంత హంగామా చేశాయో మనం చూశాం. ఈ విషయాన్ని జనం పట్టించుకోకపోయినా వైసీపీ, టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్దాలు నడిచాయి. తర్వాత వైసీపీ నేతలు జోక్యం చేసుకుని సీఎం సంతకం పెట్టారు ఏం చేస్తారో చేసుకోండి అనడం విమర్శలకు దారితీసింది. దేవాలయాల విషయంలో కూడ వైసీపీ లీడర్ల నోటి దురుసు జనానికి విస్మయాన్ని కలిగించింది.
ఇవన్నీ చలవన్నట్టు కొత్తగా టీటీడీకి వివిధ బ్యాంకుల్లో ఉన్న 5 వేల కోట్ల ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టాలనే ప్రతిపాదన మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదంతా కేవలం రాష్ట్ర ఖజానాను నింపడం కోసమేనని, వాటితో సంక్షేమ పథకాలు అమలుచేసి ఓటు బ్యాంకును కాపాడుకోవటమే జగన్ లక్ష్యమని, ఇలా దేవుడి సొమ్మును రాజకీయ కార్యకలాపాలకు వాడాలనుకోవడం న్యాయం కాదని, ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాకపోతే దేవుడి సొమ్ముకు జవాబుదారి ఎవరంటూ అనేక ప్రశ్నలు వెల్లువలా పుట్టుకొచ్చాయి. చివరికి టీటీడీ ప్రజా సంబంధాలు అధికారి రాష్ట్ర సెక్యూరిటీల్లో పెట్టాలనే అంశాన్ని కేవలం ఐచ్చికంగా పరిగణలోకి తీసుకున్నాం తప్పితే పెట్టడం లేదని, బ్యాంకుల్లోనే డిపాజిట్ల రూపంలో కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఇలా చేయని పనులకు, కేవలం పరిశీలనలో ఉన్న అంశాలకే ప్రభుత్వం మీద విమర్శలు లేచే పరిస్థితి ఎందుకొస్తోందనేది పాలకమండలి, నాయకులు పరిశీలించుకోవాలి. పరిశీలన మాత్రమే అయినప్పుడు ఇలాంటి సున్నితమైన విషయాలను ప్రజలు దృష్టిలో తప్పులుగా ముద్రపడకుండా డీల్ చేయాలి. అంతేకాని పిడులుగుల్లా జనం గుండెల మీద పడేలా చేసి అప్రదిష్టను మూటగట్టుకోవడం పార్టీకే నష్టం.