చంద్రబాబునాయుడుతో పాటు ఆయనకు ఎల్లో మీడియా కూడా మూడు రోజులుగా ఒకటే విషయాన్ని ఊదరగొడుతోంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వటం లేదని చెప్పటంతో రియల్ ఎస్టేట్ రంగంపై బాగా ప్రభావం చూపుతోందిట. పైగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రియల్ భూమ్ దెబ్బతిన్నదట.
జగన్ అధికారంలోకి రావటం, అప్పి ఇస్తుందనుకున్న ప్రపంచబ్యాంకు వెనక్కుపోవటం లాంటి విషయాలను పక్కనపెడదాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా ఆరోపిస్తున్నట్లు రియల్ ఎస్టేట్ భూమ్ పడిపోయిందే అనుకుందాం. పడిపోతే ఎవరికి నష్టం?
చంద్రబాబు హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ముసుగులో చాలామంది టిడిపి నేతలు, బడా కాంట్రాక్టర్లు, చంద్రబాబు సామాజికవర్గం వాళ్ళు చాలా మంది పెద్ద ఎత్తున భూములు కొనేసినట్లు ప్రచారంలో ఉంది. గడచిన ఐదేళ్ళల్లో వాళ్ళలో చాలామంది రియల్ఎస్టేట్ ముసుగులో వ్యాపారానికి తెరలేపారు.
ఐదేళ్ళల్లో వాళ్ళేసిన వెంచర్లు మధ్యలో ఉండగా ప్రభుత్వం మారింది. దాంతో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయింది. చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా ఆందోళనంతా అదే. నిజానికి రియల్ భూమ్ తగ్గితే మధ్య తరగతి జనాలకు లాభమే కదా ? ఇంతకాలం ప్లాట్లు కొనుగోలుకు దూరంగా ఉన్నవారు కొనే అవకాశం ఉంది. జనాలకు లాభం జరుగుతుంటే ఆనందించాల్సిన చంద్రబాబు, ఎల్లోమీడియా వ్యాపారస్తులకు నష్టం జరుగుతోందని బాధపడటమేంటి ?