వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు.! ఎందుకీ హంగామా.?

రాజకీయ నాయకులు అరెస్టవడం, బెయిల్ మీద విడుదలవడం.. లేదా జైలుకు వెళ్ళడం.. ఇవన్నీ సర్వసాధారణం. పైగా, అరెస్టవడం అంటే రాజకీయాల్లో అదనపు క్వాలిఫికేషన్ అయిపోయిందిప్పుడు.! కుట్ర పూరిత కేసుల్లో నాయకులు అరెస్టయితే సింపతీ పెరుగుతుంది.

అసలు ఇదంతా ఇప్పుడెందుకంటే, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు చుట్టూ చాలా రాజకీయ రచ్చ జరుగుతోంది. ఆయనింకా అరెస్టు కాలేదు. అవుతారో లేదో చెప్పలేం కూడా.! మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి మీద ఆరోపణలున్నాయి.. సీబీఐ ఆయన్ని అరెస్టు చేసే అవకాశముంది.

‘సీబీఐ అరెస్టు గనుక చేయాలనుకుంటే ఈపాటికే చేసేదే..’ అన్న వాదనల్లో నిజం లేకపోలేదు. రేపు అవినాష్ రెడ్డి వ్యవహారంపై హైకోర్టు తుది తీర్పు ఇవ్వబోతోంది. సుప్రీంకోర్టు అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన మద్యంతర బెయిల్‌ని కొట్టి పారేసింది. ఆ బెయిల్ గడువు రేపటితో ముగుస్తుంది.

సో, ఇక్కడ సునీతా రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించి పెద్దగా సాధించిందేమీ లేదు. పైపెచ్చు, హైకోర్టు వ్యవహారంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేయడమన్నది.. వ్యవస్థల పట్ల ప్రజల్లో కొంత అనుమానాలు ఏర్పడటానికి కారణమైంది.

రెండు నెలలపాటు ఈ కేసు విచారణ నిమిత్తం సీబీఐకి గడువు పెంచింది సర్వోన్నత న్యాయస్థానం. అంటే, ఇక్కడా అవినాష్ రెడ్డికి వెసులుబాటు కలిగినట్టేనేమో.! ఈమాత్రందానికి ఎందుకీ లేనిపోని హంగామా.?