రాజకీయాల్లో మహిళలకెందుకీ వేధింపులు.!

ఆకాశంలో సగం.. అన్నింటా సగం.! ఔను, రాజకీయాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు.! కానీ, ఎందుకింతలా మహిళలు వేధింపులకు గురవుతున్నారు.? మగాళ్ళతో సమానంగా.. ఆ మాటకొస్తే, అంతకు మించిన స్థాయిలో మహిళా నేతలు రాజకీయ విమర్శల్ని అత్యంత జుగుప్సాకరంగా చేస్తున్నారు. ఈ క్రమంలో అట్నుంచి వస్తోన్న కౌంటర్ ఎటాక్‌నీ ఎదుర్కోవాల్సి వస్తోంది.

రాజకీయాల్లో సభ్యత అవసరం. కానీ, ఇప్పుడున్న రాజకీయాల్లో అసలు సభ్యతకు తావు లేకుండా పోతోంది. అసభ్యతే రాజ్యమేలుతోంది. ఎవరు ఈ అసభ్యతను మొదలెట్టారంటే చెప్పడం కష్టం. తిలా పాపం.. తలా పిడికెడు.. అంతే.! అసలు విషయమేంటంటే, టీడీపీకి చెందిన కొందరు మహిళా నేతలపై (వీళ్ళల్లో కొందరు ఫక్తు రాజకీయ నాయకులైతే, కొందరు సోషల్ మీడియా ద్వారానో.. మరో రకంగానో తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నారు) సోషల్ మీడియా వేదికగా ఓ దుష్ప్రచారం మొదలైంది.

ఆయా నేతలపై కథనాలతో కూడిన ఓ ‘పేజ్’ (ఈ-పేపర్) లాంటిది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఇది వైసీపీనే చేసిందన్నది టీడీపీ ఆరోపణ. కానీ, టీడీపీ ఆరోపణల్ని వైసీపీ ఖండిస్తోంది. తప్పెవరు చేశారో తేలాలంటే, పోలీసులు విచారణ చేపట్టాలి. రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించాల్సిన రీతిలో స్పందించాలి. ప్రభుత్వంలో వున్న పార్టీకి మచ్చ గనుక, వున్నపళంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఘటనపై, పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి.

ఇప్పుడంటే టీడీపీ.. రేప్పొద్దున్న వైసీపీ మహిళా నేతలకూ ఇలాగే జరగొచ్చు. జనసేన పార్టీకి చెందిన మహిళలపైనా దుష్ప్రచారం జరగొచ్చు. కలుపు మొక్కల్ని ఏరి పారేయాలి రాజకీయాల్లో.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు.