వాళ్ళిద్దరి ముందు చంద్రబాబునాయుడు ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఫలితంగా సమస్య చంద్రబాబు మెడకే చుట్టుకుంది. ఇంతకీ వాళ్ళిద్దరూ ఎవరు ? చంద్రబాబు ప్లాన్ ఏంటి ? చంద్రబాబు మెడకు చుట్టుకోవటం ఏమిటి ? అనే విషయాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. తెలుగుదేశంపార్టీలో కొన్ని నియోజకవర్గాల నేతలు చంద్రబాబుకు కొరకరాని కొయ్యల్లాగ తయారయ్యారు. అటువంటి నియోజకవర్గాలు సుమారు ఏ 15 ఉన్నాయి. అందులో కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి వర్గాలకు ఉప్పు నిప్పు లాగ ఉంటుంది వ్యవహారం. అలాంటి వారిద్దరినీ ఏకం చేయాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు.
షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. కాబట్టి కాబట్టి ఇద్దరు వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీకి పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన ఆదినారాయణ రెడ్డి తర్వాత టిడిపిలోకి ఫిరాయించటంతోనే సమస్య మొదలైంది. ఇఫుడు ఇద్దరూ టిడిపిలోనే ఉన్నారు కాబట్టి, ఇద్దరూ జమ్మలమడుగుపైనే దృష్టి పెట్టారు కాబట్టి సమస్య చంద్రబాబు మెడకు చుట్టుకుంది. ఇద్దరిలో ఒకరిని కడప ఎంపిగా పోటీ చేయిస్తే మరొకరిని జమ్మలమడుగు అసెంబ్లీలో పోటీ చేయించాలన్నది చంద్రబాబు ఆలోచన.
చంద్రబాబు ఆలోచన వరకూ బాగానే ఉంది. కానీ ఎంపిగా ఎవరు పోటీ చేయాలన్న విషయం మీదే పీటముడి పడింది. ఇద్దరిలో ఎవరు కూడా ఎంపిగా పోటీ చేయటానికి ఇష్టపడటం లేదు. ఆ విషయం తేల్చటానికే రెండు రోజుల క్రితం అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున 4 గంటల వరకూ పంచాయితీ పెట్టారు చంద్రబాబు. అయినా ఇద్దరికి మధ్య సయోధ్య కుదరలేదు. పోనీ మీరే తేల్చుకుని చెప్పండటంటే అదీ చెప్పటం లేదు. అంటే వాళ్ళిద్దరూ తేల్చుకోవటం లేదు. పోనీ చంద్రబాబు చెప్పింది వింటారా అంటే అదీ లేదు. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. వీళ్ళిద్దరి పంచాయితీ తేలితే కానీ జిల్లా ప్రశాంతంగా ఉండదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే వీళ్ళమధ్య సయోధ్య కుదర్చటానికి చంద్రబాబు ఇంతలా ప్రయత్నిస్తున్నారు.
ఇద్దరిలో ఎవరు కూడా కడప ఎంపిగా పోటీ చేయటానికి ఎందుకు ఇష్టపడటం లేదు ? ఎందుకంటే, గెలుపుపై నమ్మకం లేకే. అదే సమయంలో జమ్మలమడుగు అసెంబ్లీ పోటీ నుండి తప్పుకోవటమంటే ప్రత్యర్ధి ఆధిపత్యాన్ని అంగీకరించినట్లు ఇద్దరు నేతలు భావిస్తుండటమే ప్రధాన సమస్య అయ్యింది. దాంతో ఎవరికి వాళ్ళుగా ప్రిస్టేజికి పోతున్నారు. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య ముసలం మొత్తం జిల్లా టిడిపిపైనే పడుతుందనే ఆందోళన చంద్రబాబులో పెరిగిపోతోంది. మరి ఈ సమస్యకు చంద్రబాబు ఎలా ముగింపు పలుకుతారో చూడాల్సిందే.