తెలుగుదేశంపార్టీ నేతలకు పిచ్చి బా…..గా ముదిరిపోయింది. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం కేర్ టేకర్ అధికారట. సీఎస్ చేస్తున్న సమీక్షలకు చంద్రబాబునాయుడును ఎందుకు పిలవటం లేదంటూ నిలదీస్తున్నారు. సిఎస్ నిర్వహిస్తున్న సమీక్షలకు సిఎంను పిలవటం ఏమిటో టిడిపి నేతలకే తెలియాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజ్యాంగ విలువలన్నింటినీ కాలరాస్తున్నారట.
ఇలా..ఏమిటేమిటో మాట్లాడేస్తున్నారు ఎల్వీపై. చంద్రబాబుకు ఇష్టం లేకుండానే ఎల్వీని ప్రధాన కార్యదర్శిగా నియమించటమే ఎన్నికల కమీషన్ చేసిన పాపమన్నట్లుంది టిడిపి నేతల వరస. ఎల్వీ దొద్దిదారిన ప్రధాన కార్యదర్శి అయినట్లు జూపూడి ప్రభాకర్ విమర్శించారు. ఎల్వీ దొడ్డిదారిన ప్రధాన కార్యదర్శి అవటమేంటో టిడిపి నేతలకే తెలియాలి.
చంద్రబాబు ఎంపిక చేసిన పునేఠాపై బదిలీ వేటు వేసిన ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీని నియమించింది. ఉద్యోగ విరమణ వరకూ ఎల్వీనే ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. అందుకే చంద్రబాబు అండ్ కో మండిపోతున్నది. అదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను, ఇచ్చిన ఆదేశాలను తిరగతోడుతున్నారు. దాన్నే చంద్రబాబు, టిడిపి నేతలు తట్టుకోలేక పోతున్నారు.
ఎవరు సిఎం అవుతారో ఎల్వీ చెప్పటమేంటని లంకా దినకర్ ప్రశ్నిస్తున్నారు. నిజానికి పలానా నేత సిఎం అవుతారని ఎల్వీ చెప్పలేదు. మీడియాతో మాట్లాడుతూ 23వ తేదీ ఫలితాల తర్వాత వైసిపికి మెజారిటీ వస్తే జగన్ 24వ తేదీన కూడా సిఎంగా బాధ్యతలు తీసుకోవచ్చన్నారు. ఒకవేళ టిడిపికి మెజారిటీ వస్తే ఎప్పుడు బాధ్యతలు తీసుకోవాలన్నది చంద్రబాబు ఇష్టమన్నారు. ఎందుకంటే, ఇపుడెలాగూ చంద్రబాబే సిఎం కాబట్టి. మే 24న కావాలంటే జగన్ సిఎంగా బాధ్యతలు తీసుకోవచ్చు అని ఎల్వీ చెప్పటాన్ని టిడిపి తట్టుకోలేకపోతోంది. అందుకే టిడిపి నేతలకు పిచ్చి బాగా ముదిరిపోతోందని అనుకుంటున్నారు.