టిడిపి నేతలు మరీ ఇంత చీపా ?

రాను రాను తెలుగుదేశంపార్టీ నేతల పరిస్ధితి మరీ చీప్ గా తయారవుతోంది. దేశవ్యాప్తంగా బిజెపికి ఎక్కడ ఎదురుదెబ్బ తగులుతున్నా ఏపిలో టిడిపి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా కర్నాటకలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడగానే టిడిపి నేతలు సంబరాలు చేసుకోవటం విచిత్రంగానే ఉంది. రాజకీయపార్టీలన్నాక గెలుపోటములు సహజం. కానీ కర్నాటకలో జరిగిన ఉపఎన్నికల్లో బిజెపిపై కాంగ్రెస్, జెడిఎస్ కూటమి గెలవటాన్ని అదేదో తామే గెలిచామన్నట్లుగా టిడిపి నేతలు మాట్లాడుతున్నారు.

 

కర్నాకటలో మూడు పార్లమెంటు, రెండు అసెంబ్లీ స్ధానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో ఒక్కటి తప్ప మిగిలిన ఐదు స్ధానాల్లోను అధికార కాంగ్రెస్, జెడిఎస్ అభ్యర్ధులే గెలిచారు. దాంతో కర్నాటకలో బిజెపి అభ్యర్ధులపై టిడిపి అభ్యర్ధులే గెలిచారన్నంతగా సంబరాలు చేసుకోవటమే విడ్డూరంగా ఉంది. నిజంగా కర్నాటక ఫలితాలకు ఏపిలో తెలుగుదేశంపార్టీకి ఏమీ సంబంధం లేదనే చెప్పాలి.  కాకపోతే నరేంద్రమోడిపై ఈమధ్య కాలంలో చంద్రబాబునాయుడు పెంచుకున్న కసి కారణంగా ఎక్కడ బిజెపి ఓడిపోయినా ఏపిలో టిడిపి సంబరాలు చేసుకుంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏమో వైసిపి ఎంఎల్ఏ రోజా మాట్లాడుతూ చంద్రబాబు, టిడిపి నేతలది శునాకనందమని వర్ణించారు.

 

కర్నాటక ఉప ఎన్నికల్లో అధికార కూటమి గెలవటంలో వింతేమీ లేదు. అధికారంలో ఉన్నది జెడిఎస్, కాంగ్రెస్ కూటమే. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ లేదా కూటమి అభ్యర్ధులు గెలవటంలో వింతేముంది ? పైగా ప్రతిపక్ష పార్టీ పవర్ ఫుల్ బిజెపి కాబట్టి కూటమి నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అభ్యర్దులను రంగంలోకి దింపుంటారు. దానికితోడు కూటమి కూడా ఈమధ్యే అధికారంలోకి వచ్చింది కాబట్టి జనాల్లో పెద్ద వ్యతిరేకత కూడా మొదలయ్యుండదు. అందుకనే అధికారకూటమి గెలిచింది.

 

ఇంతదానికే కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలే తెలంగాణాలోని ముందస్తు ఎన్నికల్లో కూడా రిపీటవుతుందని అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డి, ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెచ్చిపోతున్నారు. ముందస్తు ఎన్నికల్లో టిఆర్ఎస్ మట్టి కరవటం కాయమంటున్నారు.  కర్నాటకలో బిజెపి ఓడిపోవటానికి తెలంగాణాలో మహాకూటమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పటం విచిత్రంగా లేదు.