కూటమిని ప్రజలు ఎందుకు గెలిపించాలి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే పైకి ఎన్ని చెబుతున్నా.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా.. ఎన్నికల సమయానికి బీజేపీ – టీడీపీ – జనసేనలు కూటమిగా ఏర్పడే ఎన్నికలకు వెళ్తాయని అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెబుతూ… గతాన్ని గుర్తు చేస్తూ వర్తమానంపై వ్యాఖ్యానిస్తున్నారు.

2014 ఎన్నికల సమయంలో కేంద్రమో నరేంద్ర మోడీ గురించి దేశ వ్యాప్తంగా చర్చ నడిచేది. మోడీ అంటే అంత కాదు ఇంతకాదు అని సోషల్ మీడియాలోనూ, మీడియాల్లోనూ వార్తలు, విశ్లేషణలు తెగ హల్ చల్ చేసేవి. దీంతో… మోడీతో జతకట్టిన చంద్రబాబు… తన సీనియారిటీ గురించి భజన చేయాల్సిందిగా పవన్ ని కోరారు! ఫలితంగా… ఆ ఎన్నికల్లో పోటీచేస్తారని భావించిన పవన్… పోటీచేయకుండా చంద్రబాబుకు మద్దతిచ్చారు.

దీంతో… 2014లో బీజేపీ – టీడీపీ – జనసేనల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినట్లయ్యింది. అనంతరం జరిగిన పరిణామాలతో ఇంకా కలిసుంటే జనం తన్నుతారని భావించారో.. లేక, విడిపోతే తప్ప ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకుని తప్పించుకోవడానికి కుదరదని అనుకున్నారో తెలియదు కానీ… 2019 ఎన్నికల్లో ముగ్గురూ విడిపోయారు. ఎవరికి వారు విడి విడిగా పోటీ చేశారు.

అయితే ఇది విడి విడిగా పోటీచేసే పొత్తని.. లోపాయకారీ ఒప్పందం అని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా చంద్రబాబుకు మేలు జరిగేలా పవన్ పనిచేశారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే 2014లో ఎందుకు కలిశారు – 2019లో ఎందుకు విడిపోయారో స్పష్టంగా తెలియదు కానీ… 2024లో మళ్లీ కలుస్తాం.. గెలిపించడం అంటున్నారు!

దీంతో… అసలు వీరంతా ఎందుకు కలుస్తున్నారు.. ఎందుకు కొట్లాడుకుంటున్నారు.. మళ్లీ ఎందుకు విడిపోతున్నారు అనే చర్చలు తెరపైకి వస్తున్నాయి. కారణం.. ఈ మూడు పార్టీలు కలవడం వెనక జగన్ ని ఓడించడం అనే లక్ష్యం తప్ప… మరో ఉద్దేశం ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే… ఈ మూడు పార్టీల సిద్ధాంతాలు పూర్తిగా భిన్నమైనవి. ఎన్నికల్లో గెలవడానికి ఈ మూడు పార్టీలు ఎంచుకున్న నినాదాలు పూర్తిగా విభిన్నమైనవి.

హిందూత్వం- ముస్లిం ద్వేషం స్లోగన్ తో భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేసుకుంటూ వెళ్తుంటే… అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను ఏమార్చుతూ కాలం వెళ్లదీస్తుంటారు చంద్రబాబు. ఇక కులాల గోల, జగన్ పై వ్యతిరేకత తప్ప మరో టాపిక్ ఎత్తకుండా జనసేన పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇలా చూసుకుంటే… వీరి సిద్ధాంతాలలోనూ, స్లోగన్స్ లోనూ ఎక్కడా భావసారూప్యత కనిపించదు. అయినా కూడా వీరు ముగ్గురు మళ్లీ కలుస్తామంటున్నారు.

దీంతో… 2014లో కలిసి ఒకే వేదికపై ఉన్న వీరి ముగ్గురు ప్రసంగాలను.. అధికారం కోసం నాడు వీరు చేసిన హామీలను.. అనంతరం వీరు అవలంభించిన వైఖరిని.. ప్రజలను ఏమార్చిన విధానలను క్షుణ్నంగా పరిశీలిస్తూ ఒక నిర్ణయానికి వస్తున్నారు ఏపీ ప్రజలు!!