జగన్నే టార్గెట్ చేస్తున్న పవన్..కారణమదేనా ?

రాష్ట్ర రాజకీయాలు విచిత్రంగా ఉంటున్నాయి. ప్రధాన ప్రతిపక్ష వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మర ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న జనసేన అధినేత  పవన్ కల్యాణ్ టార్గెట్ చేయటమే విడ్డూరంగా ఉంది. బహుశా రాష్ట్రంలో ఉన్న విచిత్రమైన రాజకీయ వాతావరణం మరే రాష్ట్రంలో కనబడదేమో ?  అధికార పార్టీని వదిలేసి ఒక ప్రతిపక్షం ఇంకో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయటం మనదగ్గరే చూస్తున్నాం. ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీ ఒకవైపు, ప్రతిపక్షాలు మరోవైపు మోహరిస్తుంటాయి. ప్రతిపక్షాల్లో ఒకదానికి మరొకటి సహకరించుకోకపోయినా ప్రతిపక్షానికి ప్రతిపక్షంగా మాత్రం మారదన్నది వాస్తవం. ఇక్కడే పవన్ పై అందరిలోను అనుమానం మొదలైంది.

 

కొద్ది రోజులుగా పవన్ ఎక్కడకు వెళ్ళినా జగన్నే టార్గెట్ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.  అసెంబ్లీ నుండి పారిపోయాడంటున్నారు. వైసిపి ఎంఎల్ఏలు అసెంబ్లీకి ఎందుకు హాజరుకావటం లేదో పవన్ కు తెలీదా ? సమస్యల నుండి పారిపోయాడంటున్నారు. ప్రతిరోజు జనాల మధ్యలోనే కదా జగన్ ఉంటున్నది కనబడటం లేదా ? ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంశాలపై చేసిన పోరాటాలు పవన్ కు ఎందుకు కనబడలేదు ? రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్య ఇలాంటి సమస్యలపై జగన్ ఎన్నో ఆందోళనలు చేశారు. ఇవన్నీ పవన్ కు కనబడటం లేదంటే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి జగన్ చేసిన పోరాటాల్లో పవన్ ఏ ఒక్క దానిలో కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేదన్నది వాస్తవం.   

 

మరి అటువంటిది జగన్ ను పవన్ ఎందుకు అలా టార్గెట్ చేసుకుంటున్నారు ? ఎందుకంటే, జగన్ దెబ్బ జనసేన పై గట్టి ప్రభావం చూపుతుందని పవన్ భయపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసం పవన్ ప్రధానంగా నమ్ముకున్నది ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలనే. పై ప్రాంతాల్లో తెలుగుదేశంపార్టీ బాగా వీకైందన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు వీకైతే ఓట్లు మొత్తం తనకే వస్తుందని పవన్ ఆశించారు. కానీ పవన్ అనుకున్నట్లు జనాలు జనసేన వైపు కాకుండా వైసిపి వైపే చూస్తున్నారట. మొన్నటి గోదావరి జిల్లాల పాదయాత్రలో కానీ ఇప్పటి ఉత్తరాంధ్రలో కానీ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి పవన్ లో ఆందోళన పెరిగిపోతోందట. ఆ కచ్చతోనే చంద్రబాబును కాకుండా జగన్నే పవన్ ను టార్గెట్ చేస్తున్నారట.