పవన్ కు మతి భ్రమించిందా ?

ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. సిఎం అయితే తప్ప జగన్ కు ప్రజా సమస్యలు పట్టవా ? అన్నది ప్రధానంగా పవన్ అడుగుతున్న ప్రశ్న. ముఖ్యమంత్రి అయితే తప్ప జగన్ ప్రజా సమస్యలను పరిష్కరించలేడా ? అని పవన్ అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలు అడగటంలోనే పవన్ ఎంత అజ్ఞానంలో ఉన్నాడో అర్ధమైపోతోంది. సమస్యలను పరిష్కారం చేసే అవకాశం అధికార పార్టీకే ఉంటుంది. దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో చూసినా ఇదే విధానం. అందులో ఏపి కి ప్రత్యేకించి మినహాయింపేమీ లేదు. సమస్యలు పరిష్కారం చేసే అవకాశం అధికార పార్టీకి కాకుండా ఎక్కడైనా ప్రతిపక్షానికి ఉంటుందా ?

 

 పవన్ ఎందుకు అంత అజ్ఞానంతో మాట్లాడుతున్నాడో అర్ధం కావటం లేదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు జనాలకు హామీలు మాత్రమే ఇవ్వగలుగుతాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేయగలమో మాత్రమే చెప్పగలవు.  అధికార పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా జనాలకు మద్దతుగా నిలబడగలవు. ప్రజా వ్యతిరేక పాలనకు నిరసన తెలుపుతాయి, ఆందోళన చేస్తాయి, ప్రజలను సమీకరిస్తాయి. ఏ ప్రతిపక్షమైనా చేసేది, చేయగలిగింది కూడా అంతే.

 

ఆపని చేయటంలో జగన్ చురుగ్గానే ఉన్నాడు. విభజన హమీల్లో ప్రధానమైనదైన ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబునాయుడు రాజీపడినా జగనే కదా మొదటి నుండి ఆందోళనలు చేస్తున్నది ? విశాఖపట్నంలో బయటపడిన భూ కుంభకోణానికి వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు చేయలేదు ? క్షీణిస్తున్న శాంతి భద్రతల విషయంలో నిరసనలు తెలిపారు కదా ? రైతు సమస్యలపై జగన్ చేసిన నిరాహార దీక్షలు పవన్ కు కనబడలేదా ?

 

ప్రజా సమస్యలపై వైసిపి చురుగ్గానే స్పందిస్తోంది. ఎటుతిరిగీ చంద్రబాబు చంకలో కూర్చుని సమస్యలను పట్టించుకోనిది పవన్ మాత్రమే. అంతెందుకు వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, 3 ఎంపిలను చంద్రబాబు నిసిగ్గుగా ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కుంటే పక్కనే ఉన్న పవన్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు ? చంద్రబాబుతో చెడిందో లేకపోతే ఇద్దరూ కలిసి నాటకాలాడుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే చంద్రబాబు, పవన్ నాటకాలాడుతున్నట్లే అనుమానం వస్తోంది.

 

చంద్రబాబుకు లబ్ది చేకూర్చేందుకు పవన్ వకాల్తా పుచ్చుకుంటే అది ఆయనిష్టం. అంతేకానీ మతిస్దిమితం లేని వాళ్ళు మాట్లాడినట్లు జగన్ పై ఎలాపడితే అలా మాట్లాడితే జనాలే తగిన బుద్ది చెబుతారన్న విషయం పవన్ గ్రహించాలి. ఇంతకీ జగన్ పై పవన్ ఎందుకంత అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు ? ఎందుకంటే, తాను నమ్ముకున్న ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తారంధ్రలో కూడా వైసిపి గాలే ఉధృతంగా ఉందని అర్ధమవుతోందట. కనీసం తన సామాజికవర్గం కూడా పూర్తిగా అండగా నిలబడటం లేదన్న మంటే పవన్ లో కనబడుతోంది. అందుకే తామిద్దరికీ కామన్ శతృవైన జగన్ పై అంత అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు.