అసెంబ్లీ ఎన్నికలపై ఎందుకు సర్వే చేేయటం లేదు ?

జాతీయ మీడియా వ్యవహారం భలే విచిత్రంగా కనిపిస్తోంది. ఇప్పటికి చాలా సంస్ధలు రాబోయే పార్లమెంటు ఎన్నికలపైనే దృష్టి పెట్టాయి కానీ ఒక్క మీడియా కూడా అసెంబ్లీ ఎన్నికలపై ఎందుకు దృష్టి పెట్టటం లేదు ? ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే అనో లేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో  ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయమై బాగానే సర్వేలు చేశాయి. సరే, సర్వేల్లో వచ్చిన అంచనాలన్నీ నిజాలవ్వాలని రూలేమీ లేదు లేండి. ఎలాగూ పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయంపై సర్వే చేస్తున్నపుడు పనిలో పనిగా  అసెంబ్లీ ఎన్నికలపైన కూడా సర్వేలు చేయవచ్చు కదా ?

జాతీయ స్ధాయిలో ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఏపిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నదే ప్రధానం. అది లోక్ సభ ఎన్నికలు కావచ్చు లేదా అసెంబ్లీలు కూడా కావచ్చు. కాకపోతే మళ్ళీ అందులో కూడా జనాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే  ప్రధాన దృష్టి పెట్టారు. రేపటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనే విషయంలో ఏ నలుగురు కలిసినా ఒకటే చర్చ జరుగుతోంది. ఇంత చర్చకు ప్రధాన కారణమేమిటంటే, చంద్రబాబునాయుడు ఎన్నికల మ్యానేజ్ మెంట్ మీదున్న జనాల్లోని నమ్మకం, జగన్మోహన్ రెడ్డికి ఉందనుకుంటున్న జనబలం.

నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో గతంలో ఎన్నడూ లేని స్ధాయిలో అవినీతి తారస్ధాయికి చేరుకుందన్నది వాస్తవం. సర్వ వ్యవస్ధలను భ్రష్టుపట్టించేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశంపార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందనే ప్రచారం బాగా జరుగుతోంది. అదే సమయంలో జగన్ చేసిన పాదయాత్రకు జనాలు బ్రహ్మరథం పట్టారు. కాబట్టి చంద్రబాబు మీదున్న వ్యతిరేకతతోనే జనాలు జగన్ కు మద్దతుగా పాదయాత్రలో నిలబడ్డారనే ప్రచారం కూడా ఎక్కువగా వినబడుతోంది. నిజానికి రెండు ప్రచారాలూ వాస్తవమనే అనుకోవాలి.

అయితే, ఇక్కడే జనాలందరిలోను ఓ అనుమానం పెనుభూతంగా మారుంతోంది.  అదేమిటంటే, ఎన్నికల మ్యానేజ్ మెంటులో చంద్రబాబు ఆరితీరిపోయిన విషయం అందరికీ తెలిసిందే. స్ట్రైట్ ఫైట్ గనుక  జరిగితే చంద్రబాబు ముందు జగన్ నిలబడలేరన్నది వాస్తవం. ఎన్నికల్లో గెలవటానికి చంద్రబాబు స్ధాయిలో మంత్రాంగం, జిమ్మిక్కులు జగన్ చేయలేరు. ఇక, చంద్రబాబు పాలన వద్దే వద్దనుకుని జనాలు గనుక పరుగు పరుగన వెళ్ళి వద్దన్నా సరే వైసిపికి ఓట్లేస్తే అప్పుడు జగన్ అధాకారంలోకి వస్తారు. మరి రాష్ట్రంలో అటువంటి  పరిస్ధితుందా ?

ఇటువంటి పరిస్ధితుల్లోనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన కూడా సర్వేలు అవసరం అనేది. పార్లమెంటు సీట్లలో మెజారిటీ సీట్లు వైసిపి ఖాతాలోనే పడతాయని సర్వేలు చెబుతున్నాయి. అయితే, ఎంపి సీట్లు గెలుచుకునే దామాషాలోనే అసెంబ్లీ సీట్లను వైసిపి గెలుస్తుందని అనుకునేందుకు లేదు.  చిత్తూరు, కడప పార్లమెంటు సీట్లే అందుకు ఉదాహరణ. చిత్తూరు ఎంపి సీట్ల పరిధిలో నాలుగో, ఐదు అసెంబ్లీల్లో మొన్నటి వరకూ కాంగ్రెస్సే గెలిచినా ఒక్క కుప్పం అసెంబ్లీలో వచ్చే  మెజారిటీతోనే చిత్తూరు ఎంపి స్ధానాన్ని టిడిపి గెలుస్తోంది. ఇక, కడప పార్లమెంటు ఫలితం కూడా అలాగే ఉంటోంది. మెజారిటీ అసెంబ్లీ స్ధానాల్లో టిడిపికి మెజారిటీ వచ్చినా పులివెందుల్లో వచ్చే మెజారిటీతో కడప ఎంపి సీటు కాంగ్రెస్ గెలుచుకుంటోంది. కాబట్టి చేసే సర్వేలేదో ఎంపిలతో పాటు అసెంబ్లీల మీద కూడా  చేస్తే జనాలకు ఓ ఐడియా ఉంటుంది కదా ?