వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఆ ఒక్కటి తప్ప.!

ఇంకో సర్వేలోనూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 25 సీట్లు వస్తాయని తేలింది. కొత్త సర్వే ఏమీ కాదు. పాత సర్వేనే. కాకపోతే, కొత్తగా హల్‌చల్ చేస్తోందంతే. ఇది లోక్ సభ సీట్ల వ్యవహారం. ఆ ఒక్కటీ ఎందుకు తగ్గించినట్లో.! పూర్తిగా 25 సీట్లూ వైసీపీ గెలిచేస్తుందని చెబితే ఎవరూ నమ్మరు గనుక, సదరు సర్వేని కాస్త మార్చారన్నమాట.

జాతీయ మీడియాకి చెందిన ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వే ఇది.! సదరు న్యూస్ ఛానల్‌కి, రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ పెంచేందుకుగాను పెద్ద మొత్తంలో సొమ్ములు ముట్టజెప్పింది వైసీపీ సర్కారు. సో, ఈ తరహా సర్వేలకు పెద్దగా విలువ వుండదు.

అయినా, వైనాట్ 175 అంటున్న వైసీపీ, ఈ తరహా సర్వేల ఫలితాలు చూసి మురిసిపోతే ఎలా.? ‘మేం ఈసారికి పోటీ చేయలేం..’ అని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిథులు, ‘కాడె’ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి అత్యంత దారుణంగా వుందనే కదా అర్థం.?

లక్కు కలిసొచ్చి వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చినా బొటాబొటి మెజార్టీతోనేనన్న చర్చ రాష్ట్రంలో రాజకీయ రచ్చబండలపై జరుగుతున్నమాట వాస్తవం. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల సానుకూలత వున్నా, వైసీపీ ప్రజా ప్రతినిథులంటేనే చిరాకొచ్చేస్తోంది జనానికి.

అధినేత వైఎస్ జగన్ ఎంత మొత్తుకుంటున్నా, వైసీపీ ప్రజా ప్రతినిథుల్లో మార్పు రావడంలేదు. ఇసుకాసురులనే ముద్ర చాలామంది వైసీపీ ప్రజా ప్రతినిథుల మీద వుంది. ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో ‘దోపిడీ’ ఆరోపణలు దాదాపు వైసీపీ ప్రజా ప్రతినిథులందరి మీదా కనిపిస్తోంది.

ఇంత నెగెటివిటీ మధ్య, పెయిడ్ సర్వేలతో వైసీపీకి కలిగే ఆనందమేంటో.!