130 సీట్లొస్తుంటే ఈసి మీద ఏడుపెందుకు ?

ఇపుడిదే అనుమానం అందరినీ తొలిచేస్తోంది. టిడిపి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో చంద్రబాబునాయుడు  మాట్లాడుతూ పార్టీకి 130 సీట్లు రావటం ఖాయంగా చెప్పారు. నేతలతో 130 సీట్లు వస్తాయని, అధికారంలోకి రాబోయేది మళ్ళీ మనమే అని చాలాసేపు ఊదరగొట్టారు. మరి మధ్యాహ్నం తిరిగేసరికి మీడియా సమావేశంలో ఈసిపై తన అక్కసంతా వెళ్ళగక్కారు.

చంద్రబాబు చెప్పుకుంటున్నట్లు నిజంగానే 130 సీట్లు వస్తే ఎలక్షన్ కమీషన్ పై పడి ఏడవటం ఎందుకు ? అనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది.  టిడిపి నేతలకు కూడా ఇదే అనుమానం వచ్చిందనుకోండి అది వేరే సంగతి. పైగా ఎన్నికల కమీషన్ చేసిన తప్పులకు తాము శిక్ష అనుభవించాలా ? అంటూ మండిపడ్డారు.  అసలు ఎన్నికల కమీషన్ చేసిన తప్పేంటో ఎవరికీ అర్ధం కాలేదు.

అయితే ఎన్నికల కమీషన్ చేసిన తప్పుకు టిడిపి శిక్ష అనుభవించటమేంటి ? ఇక్కడ శిక్ష అంటే ఎన్నికల్లో ఓడిపోవటం తప్ప ఇంకేముంది ? అంటే ఎన్నికల్లో టిడిపి ఓడిపోతోందని చంద్రబాబుకు బాగా అర్ధమైపోయిందని అందరికీ అర్ధమైపోయింది. కాకపోతే మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్నారు. ఫలితాలు వెలువడేందుకు ఇంకా 41 రోజులుంది వ్యవధి. 

అదృష్టమో లేకపోతే దురదృష్టమో తెలీదుకానీ ఫలితాలు వచ్చేంతవరకూ  చంద్రబాబే ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలి. అంత వరకూ ఏం చేయాలి ?  చేసేదేముంది ఫైళ్ళపై సంతకాలు చేస్తు కాలం గడపటమే.