సమీక్షలు చేయాలి..నేనే సమీక్షలు చేయాలి..సమీక్షలు చేసే అధికారం చీఫ్ సెక్రటరీకి లేదు.. ఇది ఎన్నికల సమయంతో ప్రతీరోజు చంద్రబాబునాయుడు చేస్తున్న గోల. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూనే సమీక్షలు నిర్వహించేందుకు చంద్రబాబు ఎందుకింతగా కక్కుర్తి పడతున్నారో అర్ధం కావటం లేదు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్షలు చేయకూడదు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదన్నది ఈసి నిబంధన. ఈ నిబంధన ఇపుడు కొత్తగా పెట్టిందేమీ కాదు. దశాబ్దాలుగా ఉన్నదే. అయినా సమీక్షలు నిర్వహించేందుకు చంద్రబాబు ఇపుడే ఎందుకింతగా గంగవెర్రులెత్తిపోతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.
తనను సమీక్షలు చేయకుండా ఈసి అడ్డుకుంటోందంటూ చిన్న పిల్లాడు స్కూలుకు పోవటానికి మారాం చేసినట్లుగా తెగ గోల పెట్టేస్తున్నారు. తనను సమీక్షలు పెట్టొద్దని ఈసి ఆంక్షలు విధంచటం ఒక ఎత్తైతే సీఎస్ సమీక్షలు నిర్వహిస్తుండటాన్నే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నట్లుగా ఉంది. సమీక్షల విషయంలో ప్రతీ రోజు ఈసిని, జగన్మోహన్ రెడ్డిని, కెసియార్ తో పాటు మోడిని చంద్రబాబు శాపనార్ధాలు పెడుతునే ఉన్నారు.
కోడ్ అమల్లో ఉన్నపుడు చంద్రబాబు ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి సమీక్షల విషయం పట్టించుకోకుండా పార్టీ కార్యక్రమాలు చూసుకుంటు ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేయటం. ఇక రెండోది తన ఆలోచనలకు తగ్గట్లుగా సమీక్షలు జరుపుకోవటానికి వీలుగా ఎన్నికల కమీషన్ నిబంధనలను మార్పు చేసుకోవటం. ఈ రెండు చేయనంత కాలం చంద్రబాబు ఎంత అరిచి గీ పెట్టినా ఉపయోగం ఉండదంతే.