కాకినాడ ఎంపి తోట అవుట్..కారణాలేంటి ?

తెలుగుదేశంపార్టీ కాకినాడ  ఎంపి  తోట నర్సింహం పోటీ నుండి తప్పుకున్నారు. అనారోగ్య కారణాలతోనే తాను పోటీ చేయలేకపోతున్నట్లు తోట ఈరోజు వివరించారు. అమరావతిలో చంద్రబాబునాయుడుతో భేటీ అయిన తోట కుటుంబసభ్యులు చాలా సేపు చర్చించారు. అనారోగ్య కారణంతోనే తాను పోటీ చేయలేకపోతున్నట్లు చంద్రబాబుతో ఎంపి స్పష్టం చేశారట. అయితే, జగ్గంపేట అసెంబ్లీలో పోటీకి తన భార్యకు టికెట్ ఇవ్వాలని ఎంపి పట్టుబడుతున్నారు.

తోట  తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఎంపి కూడా మునుపటిలా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనటం లేదు. కారణాలేవైనా తోటకు చంద్రబాబుకు మధ్య గ్యాప్ పెరిగిందని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. దాంతొ  కాకినాడ లోక్ సభ నియోజకవర్గంలో తోట మళ్ళీ పోటీ చేస్తారా ? లేదా ? అన్నది సందేహంగా మారింది.

అయితే, హఠాత్తుగా ఈరోజు చంద్రబాబును కలసిన తోట రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తాను పోటీ చేయబోవటం లేదని చెప్పటం పార్టీలో కలకలం రేపింది. టిడిపి వర్గాల సమాచారం ప్రకారమైతే నర్సింహంకు అంతగా అనారోగ్యమైతే ఏమీ లేదట. అయినా అనారోగ్యాన్ని సాకుగా చూపించి తోట మాత్రం పోటీలో నుండి తప్పుకుంటున్నారు.

అసలు క్షేత్రస్ధాయిలో పార్టీ పరిస్ధితే బావోలేదని ఎంపి ఫీడ్ బ్యాక్ కూడా తెప్పించుకున్నారని సమాచారం. నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది. దాంతో పోటీ చేసినా గెలవనని ఎంపికి అర్ధమైందట. అందుకనే అనారోగ్యం పేరుతో తప్పుకుంటున్నారు. అయితే భార్యకు జగ్గంపేట అసెంబ్లీ టికెట్ అడగటమే విచిత్రంగా ఉంది. జగ్గంపేటలో ఫిరాయింపు ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రు ఉండగా తన భార్యకు ఎంపి టికెట్ అడగటం దేనికి సంకేతాలు ?