జగన్ శ్రీకాకుళం ఎందుకు వెళ్ళలేదు? ఆంతర్యం ఏమిటి?

తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయింది. ఉద్దానం రైతుల్ని తీవ్ర నష్టం చేకూర్చింది. శ్రీకాకుళం తుఫాను బాధితులను నేతలు వరుసగా పరామర్శిస్తుంటే జగన్ ఇంకా శ్రీకాకుళం వెళ్లకపోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు సరే సరి. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తూ కూడా జగన్ సమీపంలో ఉన్న శ్రీకాకుళం వెళ్లకపోవడంపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇన్ని రోజులు అవుతున్నా జగన్ తుఫాను బాధితులను పరామర్శించటానికి వెళ్లకపోవడంపై వైసీపీ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. జగన్ ఇంకా ఎందుకు శ్రీకాకుళంలో పర్యటించట్లేదు అని ఆలోచనలో పడ్డారు. అసలు వెళ్తారా? వెళ్ళారా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే కింద పూర్తి మ్యాటర్ చదవండి.

శ్రీకాకుళం జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో పర్యటించారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తుఫాను వచ్చిన ఆరు రోజుల తర్వాత శ్రీకాకుళంలో పర్యటించి చంద్రబాబుపై విమర్శల దాడి మొదలెట్టారు. సహాయక చర్యల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా చేయలేకపోయారంటూ దుయ్యబట్టారు. కాగా జగన్ శ్రీకాకుళం ఎందుకు వెళ్ళలేదు? జగన్ ఆంతర్యం ఏమిటి? అనే ప్రశ్న అందరి బుర్రల్ని తొలిచేస్తోంది. శ్రీకాకుళం విషయంలో జగన్ ఆలోచన మరోలా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కావాలనే శ్రీకాకుళం పర్యటించట్లేదని సమాచారం.

తుఫాను బాధిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధితులను పరామర్శించేందుకు జగన్ రెండు కమిటీలను ఏర్పాటు చేసారు. గత కొన్ని రోజులుగా ఆ రెండు కమిటీలు ఆయా ప్రాంతాల్లో ఇదే పనిలో ఉన్నాయి. కాగా చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికే జగన్ శ్రీకాకుళంలో పర్యటించట్లేదని తెలుస్తోంది. తుఫాను బాధితులకు కూడా మంచి చేకూర్చాలని ఆలోచనతోనే ఆయన వెళ్లట్లేదని సమాచారం. జగన్ ఇప్పుడే తుఫాను ప్రాంతంలో పర్యటిస్తే చంద్రబాబు నాయుడు మొక్కుబడిగా శ్రీకాకుళంలో పర్యటించి అమరావతి వచ్చేసి తిత్లీ బారి నుండి ప్రజలను కాపాడాను, తిత్లీని తరిమేసాను అని అమరావతి వచ్చేసేవారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ తర్వాత అక్కడ పరిస్థితులపై చర్చకు అవకాశం ఉండదు.

అందుకే జగన్ 15 రోజుల తర్వాత శ్రీకాకుళం పర్యటించాలని ఆలోచనలో ఉన్నట్టు వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తుఫాను భారిన పడ్డ ప్రతి ప్రాంతంలోనూ జగన్ పర్యటిస్తారని ఆయన వెల్లడించారు. 15 రోజుల తర్వాత పర్యటిస్తే తుఫాను ప్రణత పరిస్థితి ఎలా ఉందొ అని మరోసారి చర్చలు జరుగుతాయి. బాధితులకు నష్టపరిహారం అందిందా? లేదా? పరిస్థితులు మునుపటిలా కుదురుకున్నాయా లేదా అని చర్చలు జరుగుతాయి. ప్రతిపక్షాలు 15 రోజుల తర్వాత పర్యటించి అప్పుడు కూడా లోపాలు ఎంచితే అధికార పార్టీకి అవమానం కాబట్టి ఇంకొంచం శ్రద్ధ తీసుకుంటుందనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.