చట్టాలకో నమస్కారం.. కోర్టులకు ఓ దణ్ణం..!

ఎక్కడికక్కడ పెరిగిపోతున్న నేరాలు.. జనాల్లో పెచ్చుమీరుతున్న విపరీత ధోరణులు..

ముసలమ్మలపై అత్యాచారాలు.. ఆడది ఒంటరిగా కాదు కదా భర్తతో బయటకు వెళ్లినా వెంటాడి వేధిస్తున్న కామాంధులు.. అన్నెం పున్నెం తెలియని పసికందులను సైతం విడిచిపెట్టకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్న మానవ మృగాలు..

బస్సుల్లో.. రైళ్లలో.. ఆఫీసుల్లో.. సినిమా హాళ్లలో.. నడిరోడ్లపై స్త్రీలకు తప్పని వేధింపులు.. బెదరించి లొంగదీసుకునే ప్రయత్నాలు.. ఒప్పుకోకపోతే బలవంతం చేస్తున్న ఉదంతాలు.. దుర్యోధన.. దుశ్శాసన దుర్నిరీతి లోకంలో.. మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం.. పురాణకాలం నుంచి అదే వరస ఆడదంటే అలుసు.. విలాస వస్తువు.. అంగటి సరకు.. మంచిగానో.. వంచించో.. ఎరవేసో.. ఆశపెట్టో.. నమ్మించో.. బెదరించో.. బలవంతంగానో.. మొత్తానికి లొంగదీసుకోవడమే మగాడి నిత్యకృత్యం.. అందుకే రోజుకో చోట ఇలా అకృత్యం.

ఎన్ని వింటున్నా.. నిన్న విజయనగరం జిల్లా రామభద్రపురంలో జరిగిన ఘాతుకం మరోసారి సభ్యసమాజం నివ్వెరపోయేలా చేసింది. అంతకు కొంచెం ముందే తల్లి నిద్రపుచ్చి ఉయ్యాలలో వేసిన ఆరు నెలల పసికందుపై అత్యంత పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడి తన వాంఛ తీర్చుకున్నాడు ఒక నరరూప రాక్షసుడు. ఇలాంటివి జరుగుతాయని ఊహించగలుగుతామా అసలు. వాస్తవానికి ఆ మనిషి ఇంట్లోకి రావడం పసికందు తల్లి చూసింది. కాని ప్రమాదాన్ని ఎలా ఊహిస్తుంది.అక్కడ ఉన్నది వయసుకి వచ్చిన ఆడకూతురు కాదు కదా.. ముక్కు పచ్చలారని పసిగుడ్డు. వచ్చింది కాస్త పరిచయం ఉన్న మనిషే. బంధువై వచ్చి రాబందులా ప్రవర్తిస్తాడని ఆ తల్లికి కనీస అనుమానం కూడా రాలేదు.వచ్చింది తోడేలని.. మనిషి రూపంలోని మృగమని.. నిలువెల్లా విషం నింపుకుని కాటేసే కాలనాగని అస్సలు అనుకోలేదు.తీరా కాసేపటి తర్వాత వచ్చి చూస్తే రక్తం మరకలతో చంటి బిడ్డ.. ఉయ్యాల కూడా తడిసిపోయేంతగా రక్తస్రావం జరిగిన దుస్థితిలో కన్న బిడ్డ. పక్కనే ధైర్యంగా నిలుచుని ఉన్న దురాత్ముడు.

ఇది బయట పడింది.. తెలియని ఉదంతాలు ఎన్నో.. తెలిసినా బయటకు చెప్పుకోలేని సంఘటనలు ఇంకెన్నో..

నిన్నటి ఉదంతం బయట పడగానే జనాల్లో విపరీతమైన ఆవేశం.. సోషల్ మీడియా వేదికగా తెగ స్పందదనలు. అంతటి ఘాతుకానికి పాల్పడిన నీచున్ని ఉరి తీయాలని.. యావజ్జీవం జైలులోనే మగ్గిపోయేలా కఠిన దండన విధించాలని.. ఇలా రకరకాలుగా జనం తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే.. ఇతర దేశాల సంగతి పక్కన పెడదాం. అక్కడ సంస్కృతి వేరు.. ఇక్కడ వేరు. మనం ప్రామాణికంగా తీసుకునే పురాణాల్లో కూడా స్త్రీలను వేధింపులకు.. హింసకు.. మానభంగానికి గురి చేసిన సందర్భాలు ఉన్నా మౌలికంగా స్త్రీని దేవతగా పూజించిన జాతి మనది. అలాంటి దేశంలో జరుగుతున్న అకృత్యాలు జాతి మొత్తం సిగ్గుపడేలా చేస్తున్నాయి. నానాటికీ అవి పెరుగుతున్నాయి.ఈ పరిస్థితికి ప్రధాన కారణం మన చట్టాలలోని లొసుగులు. మానభంగం..అత్యాచారం.. ఇవనే కాదు ఎంత పెద్ద నేరం చేసి అరెస్టు అయినా బెయిల్ వస్తుంది.. అటు తర్వాత సంవత్సరాల కొద్ది న్యాయస్థానాల్లో సాగదీత… కొన్ని సందర్భాల్లో స్వల్ప దండన..లేదా సాక్ష్యాలు లేవంటూ విడుదల..!

రాత్రి నేరం.. పొద్దున్నే అరెస్టు.. సాయంత్రానికి బెయిలు.. ఇదీ వరస.. ఒకసారి బెయిల్ వస్తే చాలు.. ఇంక కోర్టులలో సంవత్సరాల తరబడి సాగదీతే. ఈలోగా నిందితులు బయట ప్రపంచంలో విచ్చలవిడిగా తిరుగుతూ సాక్ష్యులను బెదరించో.. కొనేసో కేసును తమకు అనుకూలంగా మార్చుకోడం. వీలైతే బాధితులకే డబ్బులు ఇచ్చేసి కేసును నీరుగార్చడం.. మొత్తానికి న్యాయానికి అన్యాయం.. అన్యాయానికి గెలుపు.. అదే న్యాయ భారతం.!

న్యాయస్థానాల్లో లొసుగుల వల్లనే దుర్మార్గాలు పెరిగిపోతున్నాయన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇటీవలే దేశంలో చట్టాలు కొన్ని మార్చారు. అయితే ఏదో వాటి పేర్లు మారినట్టు అనిపించింది కాని స్వరూపం మారినట్టు కనిపించలేదు.

కింద కోర్టు… పై కోర్టు.. హై కోర్టు.. కడకు సుప్రీం కోర్టు.. ఈలోగా జీవిత కాలం గడిచిపోద్ది. కొన్ని సందర్భాల్లో తుది తీర్పు వెలువడే పాటికి అయితే నిందితులో.. లేదా బాధితులో మరణించడం కూడా జరుగుతుంది. Delayed justice is denied justice ఇదే వరస.

నిజానికి మానభంగం.. అత్యాచారం..ఇలాంటివి అత్యంత తీవ్రమైన నేరాలుగా పరిగణించవలసి ఉంటుంది. ఇలాంటివి జరిగినప్పుడు నిందితుల తరపున వాదించడం కాదు కదా బెయిల్ ఇప్పించేందుకు కూడా న్యాయవాదులు ముందుకు రాకూడని నిబద్ధత పాటించే రోజు రావాలి. పొలీసులు కూడా ఈ తరహా కేసులను మానవతా దృక్పథంతో విచారణ చేసి నిందితులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోడానికి వీలు ఉండని రీతిలో ఎఫ్ ఐ ఆర్లు సిద్ధం చెయ్యాలి.న్యాయస్థానాలు కూడా వీటిని ప్రత్యేక కేసులుగా పరిగణించి సత్వర విచారణ జరిపి త్వరిత గతిన తీర్పులు వెలువడేలా వ్యవహరించాలి. ఆ తీర్పులు కూడా కఠినంగా ఉండాలి. మళ్ళీ ఇంకొకరు అలాంటి నేరం చెయ్యడానికి భయపడేలా శిక్షలు ఉండాల్సిన అవసరముంది.నిజానికి ప్రజలైతే నేరం జరిగిన వెంటనే అక్కడికక్కడే శిక్ష పడిపోవాలి సుమీ అన్నంత కసిగా ఉంటారు.ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని పోలీసులకు అప్పగించే కంటే తామే శిక్షించాలన్నంత కసిగా ఉంటారు ఆయా సందర్భాల్లో ప్రజలు.. ముఖ్యంగా మహిళలు.

పాకిస్తాన్లో మిలటరీ పాలన అమలులో ఉన్న రోజుల్లో ఇలాంటి సత్వర శిక్షలు అమల్లో ఉండేవి.దొంగతనం చేస్తే వేళ్ళు నరికేయడం.. మానభంగానికి అంగం కోసేయడం.. ఇంకా తీవ్రమైన నేరాలకు అక్కడికక్కడే ఉరిశిక్ష.. ఇలా ఉండేవట చట్టాలు.

ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఆ తరహా శిక్షలు అమలులో ఉన్నాయి. మన దేశంలోనే ప్రధానంగా ఇలా సాగదీతలు. చిన్నప్పటి నుంచి వింటున్న మాట..వెయ్యి మంది నేరాస్తులైనా తప్పించుకోవచ్చు గాని ఒక్క నిర్దిషికి శిక్ష కడకూడదట..అదే లక్ష్యంగా మన దేశంలో చట్టాలు రూపు దిద్దుకున్నాయని అంటారు. ఆ మాట దేవుడెరుగు.. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నది అదే.. నేరస్తులు ఏదో ఒక రూపంలో తప్పించుకుంటూనే ఉన్నారు.కొందరైతే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నారు. న్యాయస్థానాలకు క్షమాపణ లతో.. ఈ చట్టాలకు ఓ నమస్కారం.!. ఇవి ఇలాగే ఉన్నంత కాలం ఈ దేశంలో ఇలాగే నేరాలు యధేచ్చగా జరుగుతూ ఉంటాయి.దుర్మార్గాలు కొనసాగుతూనే ఉంటాయి. ఎంతటి తీవ్రమైన నేరాలు చేసిన వారైనా సమాజంలో యధేచ్చగా తిరుగుతూ ఉంటారు.

ఇప్పటికైనా దేశం మేల్కొనాలి.. పరిపాలకులు ఆలోచనలు చెయ్యాలి. న్యాయ నిపుణులు జోక్యం చేసుకుని చట్టాల్లో మార్పులు తేవాలి..నేరం చెయ్యాలంటే భయపడేలా చట్టాల్లో సంస్కరణలు జరగాలి. నేరాలకు పురిగొల్పే పరిస్థితులు కూడా మారాలి. మద్యం..మాదకద్రవ్యాలు.. ఇవి అందుబాటులో ఉండకుండా చూడాలి. ఇవన్నీ జరిగేవి కావు. అయినా మన ప్రయత్నం జరగాలి..జరుగుతూనే ఉండాలి. మనకి కూడా సంఘటన జరిగినప్పుడు ఉండే ఆవేశం మర్నాటికి ఉండదు. ఆ మర్నాటికి మర్చిపోతాం. అంతా మామూలే.. అందరూ బాగుండాలి.. అనే కంటే మనం బాగుండాలి.. బాగానే ఉన్నాం.. ఇదే తీరు.. అదే పద్ధతి.

జనానికి తమ బాగే ముఖ్యం.. పాలకులకు అధికారమే ప్రధానం. అందరూ ఎవరి పనుల్లో వారుంటారు. ఆవేదన కలిగినప్పుడో.. గుర్తు వచ్చినప్పుడో సామాజిక వేదిక సాక్షిగా ఓ స్టేట్మెంట్.. అంతే. మన పాత్ర పూర్తయినట్టే.. మన వంతు కర్తవ్యం నిర్వహించినట్టే..

ఇలా అయితే ఈ అరాచకాలు ఆగేదెలా.. ఈ దేశం బాగుపడేదెప్పుడు..

ఈ ప్రశ్నలకు బదులేది..!?