ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, నాలుగు సార్లు విజయం సాధించిన గొట్టిపాటి రవి కుమార్ కు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తున్న కూడా ఆయనకి ఎదురు నిలిచి ఢీ కొట్టే నేత లేకపోవడం గమనార్హం. వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకున్న రవి ,పార్టీ ఏదైనా విజయం సాధిస్తున్నారు. మొదట్లో కాంగ్రెస్ లో ఉన్న గొట్టిపాటి రవి 2004లో మార్టూరు నుంచి విజయం సాధించారు. తర్వాత నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో ఆయన అద్దంకికి మారారు.
ఈ క్రమంలోనూ 2009లో కాంగ్రెస్ తరఫున విజయం దక్కించుకున్నారు. ఇక, ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ను విడిచి వైసీపీలోకి చేరిపోయారు. ఈ క్రమంలో 2014లో మరోసారి అద్దంకి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక, తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలోకి జంప్ చేశారు.
ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ పార్టీలు మారినా వ్యక్తిగత ఇమేజ్ కారణంగా.. గొట్టిపాటి బలంగా నెగ్గుకు వస్తున్నారు.కానీ, ఆయనకి చెక్ పెట్టాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. గతంలో టీడీపీ తరఫున పోటీ చేసిన కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్‌లను కూడా రవి కుమార్ చిత్తుగా ఓడించారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన చెంచు గరటయ్యను కూడా రవి ఓడించారు.
పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రవి కుమార్‌ను ఎదుర్కొనడం, ఆయనను ఓడించే నేతను రంగంలోకి దింపడం అసాధ్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీకి రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి బలరాంకు అక్కడ టికెట్ ఇవ్వడం లేదా, ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్యకి అవకాశం ఇవ్వడం. అయితే ఈ ఇద్దరు కూడా రవిని ఢీ కొట్టి నిలిచే నాయకులు అయితే కాదని వైసీపీ వర్గాలే భావిస్తున్నాయి. కరణం ఫ్యామిలీని రెండుసార్లు ఓడించడం అంటే రవి సత్తా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.