ఒకప్పుడంటే కమ్యూనిస్టులు కానీ ఇప్పుడు కాదనేది రెడ్ పార్టీల మీద జనానికున్న అభిప్రాయం. దశాబ్దం క్రితం వరకు కమ్యూనిస్టుల మాటంటే ప్రజల్లో గౌరవం ఉండేది. వారేం మాట్లాడిన అందులో ప్రజా ప్రయోజనం ఉంటుందనే నమ్మకం ఉండేది. అదే ఇప్పుడు కొరవడింది. ఇతర పార్టీల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని వార్తల్లో నిలవడం మినహా కమ్యూనిస్టులు ప్రస్తుతం చేస్తున్న గొప్ప కార్యం ఏమీ లేదు. రాజకీయాలను ప్రభావితం చేయడం ఏనాడో మానేసిన వారు రాజకీయ నాయకులను ప్రభావితం చేస్తున్నారు. ఇక్కడ ప్రభావితం అంటే బెదరగొట్టడమో, బెంబేలెత్తించడమో అనుకునేరు.. ఆకట్టుకోవడం, ఆనందింపజేయడం.
మొదటి నుండి ఎర్ర జెండాకు, పచ్చ జెండాకు పడేది కాదు. వీలు చిక్కినప్పుడల్లా టీడీపీ పాలనను ఎండగట్టే ప్రయత్నం చేసేవారు. టీడీపీ అనే కాదు కాంగ్రెస్ మీద కూడ అలాగే ఉండేది వారి వైఖరి. కానీ ఇప్పుడది మారింది. నిత్యం ఏదో ఒక పార్టీని పొగడటమే పనిగా పెట్టుకున్నారు వారు. ఈమధ్య ఎక్కువగా టీడీపీ మీద మక్కువ చూపిస్తున్నారు. విశాఖలో గీతం యూనివర్సిటీ ఆక్రమిత ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీ నిర్మాణాలు కొన్నింటిని కూలగొట్టారు. టీడీపీ అంటే ప్రభుత్వాన్ని దుయ్యబట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ప్రభుత్వం చర్యను కుట్రపూరిత చర్యగా అభివర్ణించి విమర్శలు చేస్తోంది. ఎన్ని విమర్శలు చేసినా అది ఆక్రమిత భూమి కాదని ఆధారాలు చూపలేకపోతోంది.
వారికి తోడు అన్నట్టు సీపీఐ స్వరం కలిపింది. అర్థరాత్రి వెళ్లి నిర్మాణాలను కూల్చాల్సిన అవసరం ఏమిటని, జగన్ విధ్వంస పాలన చేస్తున్నారని, ప్రభుత్వ భూముల విషయంలో శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేశారు కె.నారాయణ. కమ్యూనిస్టులు డిమాండ్ చేయాల్సింది ఎవరైనా పేద వారి ఇళ్ళు, దుకాణాలు కూలగొట్టినప్పుడు. ఎర్రన్నలు యుద్ధం చేయాల్సింది ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు. అంతేకానీ ఇలా భూ ఆక్రమణకు పాల్పడినవారిపై చర్యలు తీసుకున్నప్పుడు కాదు. కోట్లకు పడగలెత్తిన గీతం యాజమాన్యం మీద విద్యాసంస్థలనే పేరుతో జాలి చూపాల్సిన పనేమీ లేదు. తప్పును నిలదీయాల్సిన ఎర్రన్నలే ఇలా మాట్లాడటం భావ్యం అనిపించుకోదు.