విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి విషయంలో చంద్రబాబునాయుడు ఎందుకు మండిపోతున్నారు ? గురువారం మధ్యాహ్నం విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగితే రాత్రి ఎప్పుడో తీరిగ్గా చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. పోనీ సమావేశంలో దాడిని ఖండించారా అంటే అదీ లేదు. దాదాపు గంటన్నరపాటు జరిగిన మీడియా సమావేశం మొత్తం దాడిని డ్రామాగా కొట్టిపాడేయటానికే తాపత్రయపడ్డారు. జరిగిన గాయం చిన్నదే అన్నారు. చిన్న గాయానికే జగన్ అంతలా డ్రామాలాడుతున్నట్లు చెప్పారు. ఏమీ లేనిదానికి ఏమో జరిగిపోయిందనే డ్రామాలు మంచివి కావటం సుద్దలు చెప్పారు.
అదే సమయంలో అసంబద్ధ విషయాలను జగన్, వైసిపిలకు ఆపాదించి తప్పంతా జగన్ దే అని తేల్చేశారు. ఒకవైపు దాడి ఘటనపై విశాఖ పోలీసు కమీషనర్ స్పెషల్ ఇన్వెస్టేగేషన్ టీం (సిట్) వేసిన విషయం తెలిసీ దాడిని డ్రామాగా చంద్రబాబు ఎలా తేల్చేస్తారు ? నిందితుడు శ్రీనివాస్ వైసిపి అభిమానిగా చిత్రీకరించటానికే తపత్రయపడ్డారు. టిడిపి నేత నడుపుతున్న క్యాంటిన్లో వైసిపి అభిమానికి ఉద్యోగం ఇస్తారా ? వైసిపి అభిమానికి ప్రభుత్వం రెండిళ్ళను మంజూరు చేస్తుందా ? ఎప్పుడో పదినెలల క్రిందటి ఓ ఫ్లెక్సీకి వైసిపి అభిమాని ఎల్లో కలర్ వాడుతారా ? ఈ ప్రశ్నలకు చంద్రబాబు నుండి సమాధానం వస్తుందని అనుకునేందుకు లేదు.
సరే, ఆ విషయాలను పక్కనపెడితే దాడి ఘటన వెలుగు చూడగానే రాష్ట్రంలో సంచలనమైంది. దాడి జరిగిన గంటకే ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, తెలంగాణా సిఎం కెసియార్, మంత్రి కెటియార్, నిజామాబాద్ ఎంపి కవిత, కేంద్రమంత్రి సురేష్ ప్రభు దగ్గర నుండి బిజెపి ప్రముఖ నేతలు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంటి అనేకమంది పరామర్శించారు.
జగన దాడి విషయంలో అంతమంది వెంటవెంటనే ఖండించటం, సానుభూతి చూపటం, నేరుగా వచ్చి పరామర్శించటాన్ని చంద్రబాబు తట్టుకోలేకున్నారు. చంద్రబాబు దృష్టిలో జగన్ ఆగర్భ శతృవు. అటువంటి ఆగర్భశతృవుకు గాయమైతే తనంటే పడని అంతమంది రాజకీయ ప్రముఖులు ఒక్కసారిగా స్పందించటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఆ ఉక్రోషమే చంద్రబాబు మాటల్లో స్పష్టంగా కనిపించింది. రేపటి ఎన్నికల్లో వాళ్ళంతా జగన్ కు మద్దతుగా నిలబడతారేమో అన్న భయమే కనబడుతోంది. తనలోని భయాన్ని కప్పిపుచ్చుకోవటానికి మాత్రమే జగన్ పై దాడి విషయంలో చంద్రబాబు ఎదురుదాడి చేసినట్లు కనబడుతోంది.