అసలు రీ పోలింగ్ ఉన్నట్లా ? లేనట్లా ?

ఏపిలో రీ పోలింగ్ జరిగే కేంద్రాలపై అందరిలోను అయోమయం నెలకొంది. మొన్నటి 11వ తేదీన పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల బాగా గొడవలు జరిగాయి. అటువంటి కేంద్రాలపై లెక్కలు వేసుకుని  ఓ ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరపాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషన్ సిఫారసు చేశారు. సిఫారసు చేసి ఇప్పటికి పది రోజులైనా ఇంత వరకూ కేంద్ర ఎన్నికల కమీషన్ నుండి ఏమాత్రం స్పందన కనబడలేదు.

కేంద్ర ఎన్నికల కమీషన్ తరపు నుండి ఎలాంటి చొరవ కనబడకపోవటంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ గోపాల కృష్ణ ద్వివేదికి ఏమి చేయాలో దిక్కు తోచటం లేదు. రీ పోలింగ్  విషయంలో రాష్ట్రం నుండి వచ్చిన సిఫారసుపై కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకోవటంలో ఎందుకింత నిర్లప్తత వహిస్తోందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

ఇదే విషయాన్ని ద్వివేది సీఈసీని అడిగారట. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల నిర్వహణ విషయంలో బిజీగా ఉన్న కారణంగా ఏపిలోని రీ పోలింగ్ సిఫారసులపై ఇంకా దృష్టి పెట్టలేదని సమాధానం వచ్చిందట. సీఈసీ చెప్పిందే నిజమైతే  మే మూడో వారం వరకూ దేశంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతునే ఉంటాయి.  అంటే ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత రీ పోలింగ్ పై ఒకేసారి సీఈసీ నిర్ణయం తీసుకుంటుందా ? అనే అనుమానాలు పెరుగుతోంది.

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని రెండో చోట్ల, తంబళ్ళపల్లి నియోజకవర్గంతో పాటు పూతలపట్టు నియోజకవర్గాల్లో బాగా గొడవలు జరిగాయి. అలాగే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి లో కూడా గొడవలు జరిగాయి. రీ పోలింగ్ విషయంలో సీఈసీ తీరు చూస్తుంటే మరో నెల రోజుల పాటు సస్పెన్స్ భరించక తప్పేట్లు లేదు.