ఏపీకి జగన్ ఎందుకు కావాలి? మరో పబ్లిసిటీ స్టంట్..!

రాజకీయం అంటే.? అధికారంలో వున్నోళ్ళు ప్రజాధనంతో సొంత పబ్లిసిటీ చేసుకోవడం. అలా సొంత పబ్లిసిటీ కోసం అధికార పీఠమెక్కేందుకు ప్రయత్నించడం కూడా రాజకీయమే.! ఇంతేనా రాజకీయమంటే.? ఇంతేనేమో.!

అప్పట్లో.. అంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో, అన్ని సంక్షేమ పథకాలకీ అయితే ఇందిరమ్మ పేరు, లేదంటే రాజీవ్ గాంధీ పేరు పెట్టేయడం చూశాం. అంతకు ముందు, చంద్రబాబు కూడా ప్రజాధనంతో సొంత పబ్లిసిటీ స్టంట్లు విచ్చలవిడిగా చేసేశారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత, చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు మరింత హేయంగా తయారయ్యాయి. చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆ చంద్రబాబు అనే పేరే వెగటు పుట్టేసింది జనానికి.

ఇప్పుడు ‘జగన్’ అన్న పేరు కూడా అలానే తయారవుతోంది. దాంతోపాటుగా, వైఎస్సార్ పేరు కూడా బదనాం అవుతోంది. ఎవరు అధికారంలో వుంటే వాళ్ళు తమ పేర్లనీ, తమ కుటుంబ సభ్యుల పేర్లనీ ఆయా సంక్షేమ పథకాలకు పెట్టుకోవడం అనేది అత్యంత హేయమైన వ్యవహారంగా జనం చర్చించుకునే దాకా వెళ్లిపోయింది పరిస్థితి.

తాజాగా, ‘వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్’ అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదేదో వైసీపీ సొంత కార్యక్రమం.. అంటే, పార్టీ వ్యవహారం అనుకునేరు.? ఇది ప్రభుత్వ కార్యక్రమం అట. ఈ మేరకు ఉన్నతాధికారులతో ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించారు. ఆ ఉన్నతాధికారులూ, కిందిస్థాయి అధికారులకు, ఈ కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు.

గడప గడపకీ వైసీపీ సహా ఇటీవలి కాలంలో చాలా కార్యక్రమాలు వైసీపీ నుంచి నడిచాయి, ముందు ముందు చాలా కొత్త కార్యక్రమాలూ తెరపైకి రాబోతున్నాయ్. అసలు వీటి వల్ల ప్రజలకు ఒరిగేదేంటి.? పార్టీ కార్యక్రమాల వల్ల వైసీపీకి ప్రయోజనం. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని.. ఇలాంటి కీలక అంశాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసమే, ‘వై ఏపీ నీడ్స్ జగన్’ లాంటి కార్యక్రమాలు షురూ అవుతున్నాయా.?

అయినా, ప్రజాధనం దుర్వినియోగం చేసే ఇలాంటి రాజకీయ కార్యక్రమాలకు అధికారులెలా ‘సై’ అంటున్నారో ఏమో.!