వైఎస్ జగన్‌పై అమిత్ షా విమర్శల వెనుక.!

ఎక్కడో తేడా కొడుతోంది.! వైసీపీ – బీజేపీ మధ్య తెరవెనుకాల ఇన్నాళ్ళూ నడుస్తూ వచ్చిన ‘అవగాహన’ ఎందుకు చెడినట్లు.? రాజధాని అమరావతి విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. చూసీ చూడనట్టు వ్యవహరించడం ద్వారా వైసీపీకి మేలు చేస్తూ వచ్చిన బీజేపీ, అనూహ్యంగా వైసీపీ సర్కారు మీద ‘అవినీతి ఆరోపణలు’ షురూ చేసింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విశాఖలో వైఎస్ జగన్ సర్కారుపై చేసిన ‘అవినీతి విమర్శలు’ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. టీడీపీ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు అమిత్ షా. జనసేన గురించీ ప్రస్తావించలేదు. అయితే, బీజేపీ నేతలు కొందరు, పవన్ కళ్యాణ్ పేరుని ప్రస్తావించారు.

బీజేపీ – జనసేన పొత్తులో వున్నాయనే విషయాన్ని బీజేపీ నేతలు కొందరు పరోక్షంగా ప్రస్తావించగా, అమిత్ షా లైట్ తీసుకున్నారు. అమిత్ షా లైట్ తీసుకున్నా బీజేపీ – జనసేన అయితే పొత్తులోనే వున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఇక, అమిత్ షా విమర్శలపై వైసీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వ్యవహారంపై స్పందించకపోవచ్చు. రేపో మాపో ఆయన ఢిల్లీకి వెళ్ళితే, అక్కడ.. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర అమిత్ షా విమర్శలపై పంచాయితీ పెడతారేమో వైఎస్ జగన్.

టీడీపీ ట్రాప్‌లో బీజేపీ మళ్ళీ పడుతోందన్నది వైసీపీ భావన. అలాగని, బీజేపీకి వైసీపీ ఉచిత సలహాలు ఇవ్వగలదా.? ఛాన్సే లేదు.