ఒక నాటి హీరో, రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముఖ్యుడు అయిన మురళీ మోహన్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదా, ఎందుకు? అనేది ఇపుడు తూర్పుగోదావరి జిల్లాలో వేడివేడి వాడివాడి చర్చ. మురళీ మోహన్ పార్టీ మీద కోపంగా ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఆయన పోటీ చేసేది లేదని కఠిన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
తాను సీన్‌లో ఉండడం లేదని మురళీ మోహన్ స్వయానా చేప్పేయడంతో కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. మురళీ మోహన్ అకస్మిక ప్రకటన రాజకీయంగా సంచలనంగా మారింది. ఇది టీడీపీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తూ ఉంది.
రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో మురళీమోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ రాజమండ్రి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలిసారి 2009లో ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓటమి పాలైనా రెండోసారి 2014లో మాత్రం ఘన విజయం సాధించారు.
దీనితో 2019 ఎన్నికల్లో టిడపి అభ్యర్తి మురళీమోహనే నని అంతా భావించారు. సిటింగ్ ఎంపిగా ఆయనకే పార్టీ కూడా ప్రాముఖ్యం ఇవ్వాలి, ఇస్తుంది కూడా.
అయితే, అనూహ్యంగా తాను పోటీ చేయలేనంటూ చెప్పి అందరిని షాక్ కు గురి చేశారు. ఈ నిర్ణయం పార్టీని బలహీన పరుస్తుందని పార్టీ వర్గాల్లో బలంగా వినపడుతూ ఉంది. జిల్లాలోని మూడు పార్లమెంట్ స్థానాలున్నాయి. ఈ మూడు మూడురకాలు డిస్టర్బ్ అవుతున్నాయి. కాకినాడ ఎంపీ తోట నరసింహం అనారోగ్యంతో పోటీ చేయలేనని ఇప్పటికే ప్రకటించారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పార్టీ వదలి వైసిపిలో చేరిపోయారు. ఇప్పుడు రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ కూడా తనకు ఆసక్తి లేదని చెప్పడం పార్టీని కుదిపేస్తూ ఉంది. అసలే 2019 ఎన్నికలు ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల చంద్రబాబుకు చాలా కీలకమయినవిగా భావిస్తున్నపుడు ఇలా ఏకంగా మూడు స్థానాలలో కొత్త అభ్యర్థులను తీసుకువచ్చి, గెలిపించుకోవడం, ఇపుడున్న పరిస్థితులలోచాలా కష్టమనే టాక్ పార్టీలో మొదలయింది.
ఎన్నో హిట్ చిత్రాల హీరో మురళీ మోహన్ తెలుగు ప్రజలకు బాగా పరిచయమున్నవాడు.
ఆయన సినీ పరిశ్రమలో రాణించి తర్వాత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో విజయవంతమయి తర్వాత టీడీపీలో చేరి ప్రత్యక్ష రాజకీయా ల్లో ప్రవేశించారు.
ఇపుడాయన హఠాత్తుగా తన ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పడం దిగ్భ్రాంతి కలిగించే విషయం. ట్రస్టు కారణంగా క్రియాశీల రాజకీయాలను వదులుకుంటారాఅనే సందేహాం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
తన నిర్ణయం మీద అపోహలు అనుమానాలు అవసరం లేదని తన సొంత ట్రస్ట్ కార్యకలాపాలు ముందుకు సాగకపోవడంతోనే తాను రాజకీయాలు విరమించుకుని ఆ కార్యక్రమాలు చూడాలని భావిస్తున్నారని, ఎటువంటి ఒత్తిళ్లకు తావులేదని మురళీ మోహన్ చెబుతున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
మురళీ మోహన్ కు ఎందుకు కోపం వచ్చింది
తెలుగుదేశం లోగుట్టు తెలిసిన కొంతమంది చెబుతున్నదాని ప్రకారం మురళీ మోహన్ కోడలు మాగంటి రూపాదేవికి ఎంపి టికెట్ కోరారు. అయితే, ఆమెకు ఇవ్వడం కుదరదని పార్టీ నాయకత్వం చెప్పిందని దానితో ఆయన అసంతృప్తికి గురయ్యారని వారు చెబుతున్నారు. కోడలిను తన వారసురాలిగా తీసుకురావాలని ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం ఒక ఎన్జీవో ద్వారా ఆమెను జనంలోకి కూడా పంపుతున్నారు. ఆ మధ్య తనకు యాక్సిడెంట్ అయినపుడు నియయోజకవర్గం బాధ్యతను ఆయన రూప కే అప్పగించారు. అపుడామే బాగా పనిచేశారని ఆయన నమ్మకం. అందుకే ఈ సారి లోక్ సభ టికెట్ ఆమెకు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే, ఆమెకు ఇవ్వడం జిల్లాలోని సీనియర్ నాయకులెవరికీ ఇష్టం లేదు. దీనితో ఆమె పేరును చంద్రబాబు నాయుడు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అసంతృప్తితో తాను ఎన్నికల్లో పోటీ చేయనని ట్రస్టు కార్యక్రమాలు చూసుకుంటానని చెప్పేశారని బాగా వినబడుతూ ఉంది.
పార్టీకి గడ్డు పరిస్థితి
పార్టీ అధినేత చంద్రబాబుకి సైతం తన నిర్ణయం చెప్పేయడంతో మురళీ మోహన్ స్థానంలో కొత్త నేత కోసం టీడీపీ మళ్లీ కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న రాజమహేంద్రవరం ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు సీనియర్లెవరూ ముందుకు రావడం లేదు. నిజానికి హాస్యనటుడు అలీ ని పోటీ చేయించాలని ఒక దశలో చర్చజరిగినా అలీ గుంటూరు జిల్లాలో పోటీచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తర్వాత బొడ్డు భాస్కరరామారావు పేరు వినిపిస్తున్నప్పటికీ ఆయన కూడా తనకు ఇష్టం లేదని చెబుతున్నారు.అంతేకాదు, పార్టీ కూడా ఆయన మీద పెద్దగా ఆసక్తిగా లేదు. అందుకే కొత్త ముఖాలు తెరమీదకు తీసుకురావలసి వస్తున్నది. ఇలా వినిపిస్తున్నవారిలో ప్రముఖమయినది అల్లూరి విక్రమాదిత్య వర్మ పేరు.. గన్ని కృష్ణ పేరు బయట వినపడుతూ ఉందిగాని, అమరావతిలో వినిపించడం లేదు. మొత్తానికి కారణమేదయినా మురళీమోహన్ నిర్ణయం జిల్లా టీడీపీ నేతలకు బాగా ఇరుకున పెట్టింది. చంద్రబాబు నాయుడు మురళీ మోహన్ ను ఒప్పిస్తారా?
టిడిపి క్యాండిడేట్ పేరు వచ్చాక వైసిపి తన అభ్యర్థిని పేరును ప్రకటిస్తుందని అంటున్నారు.