తమ్మినేని సీతారాం మరియు ధర్మాన కృష్ణ దాస్ ఇద్దరు వైస్సార్సీపీ పార్టీ ముఖ్య నాయకులు. ఇద్దరు ప్రభుత్వంలో గొప్ప పదవులలో ఉన్నారు. ఇద్దరు కూడా సీఎం జగన్ కి అంత్యంత ఆప్తులు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఒక విషయంలో జరుగుతున్న వివాదంలో చివరికి జగన్ గారు నలిగిపోతున్నారట.
శ్రీకాకుళంలో తప్ప రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు క్రికెట్ స్టేడియంలు ఉన్నాయి. దాంతో శ్రీకాకుళంలో క్రికెట్ స్టేడియం కావాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి హయాం ముగిసి చంద్రబాబు నవ్యాంధ్ర సీఎం అయినా కూడా ఆ కోరిక అలాగే ఉండిపోయింది. దాంతో వైసీపీ వచ్చాక మళ్ళీ పావులు కదిపారు. జగన్ తాజా మంత్రి వర్గ సమావేశంలో సిక్కోలుకి క్రికెట్ స్టేడియం మంజూరు చేశారు. అయితే ఆముదాలవలస దగ్గర ఉన్న క్రీడా మైదానాన్ని ఏడాదికి రెండు లక్షల లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. అది స్పీకర్ నియోజకవర్గం. దాంతో ఇపుడు తమ్మినేని వర్గీయులు జిల్లాకు స్టేడియం తెచ్చామని సంబరపడుతున్నారట.
ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ అసంత్రృప్తి గా ఉన్నారట. తానున్న మంత్రి వర్గ సమావేశంలో తనకు కూడా తెలియకుండా సైలెంట్ గా ఫైల్ మూవ్ చేసి ఆముదాలవలసకు క్రికెట్ స్టేడియాన్ని తమ్మినేని తెచ్చుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట . శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో క్రికెట్ స్టేడియం ఉండాలి కానీ ఆముదాలవలలో ఏంటని క్రికెట్ క్రీడాకారులు ధర్మాన కృష్ణదాస్ వద్ద మొర పెట్టుకున్నారుట. దాంతో దాన్ని శ్రీకాకుళానికి షిఫ్ట్ చేయడానికి ధర్మాన కంకణం కట్టుకున్నారని అంటున్నారు.
రాజకీయ క్రీడలో ఇద్దరూ ఆరితేరిన ఆటగాళ్లే. అయితే తమ్మినేని సీతారాం బాగా సీనియర్. పైగా జగన్ వద్ద ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ఇక ధర్మాన అంటే కూడా ముఖ్యమంత్రికి ఇష్టమే. దాంతో ఇపుడు ఈ ఇద్దరూ క్రికెట్ స్టేడియం పంచాయతీ పెడితే జగన్ ఎటు మొగ్గుతారు అన్నది కూడా ఆసక్తికరమే. ఉప ముఖ్యమంత్రిగా తాను ఉండగా క్రికెట్ స్టేడియాన్ని శ్రీకాకుళానికి తీసుకురాకపోతే చిన్నతనంగా ధర్మాన భావిస్తున్నారట. చివరికి ఈ పంచాయితీ ఎక్కడికి పోయి ఆగుతుందో , ఎవరు నెగ్గుతారో వేచి చూడాలి మరి.