పట్టుబడిన బంగారం టిటిడిది కాదా ?

తిరుమల తిరుపతి దేవస్దానం కు చేరుకున్న బంగారంపై కొత్త ఆరోపణలు ముసురుకుంటున్నాయ్. ఇప్పటి వరకూ అందరికీ తెలిసింది, ప్రచారంలో ఉన్నది రూ. 400 కోట్ల విలువైన  1381 కిలోల బంగారం. కానీ ఎన్నికల కమీషన్ కు పట్టుబడిన బంగారం 1750  కిలోల బంగారమనే కొత్త ఆరోపణ మొదలైంది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట ప్రాంతంలో ఓ ప్రముఖుడికి అప్పగించేందుకే చెన్నైలో ఓ వాహనం నుండి బయలుదేరినట్లు తాజాగా ప్రచారం మొదలైంది. అంటే మధ్యలో ఎక్కడా పట్టుబడకుండా ఉండుంటే పై మొత్తం బంగారం ఈ పాటికే ప్రముఖుడికి చేరిపోయుండేదట.

టిటిడి ట్రెజరీకి చేరిన బంగారం 1381 కిలోలు కాదని 1750 కిలోలుగా సంబంధిత అధికారుల ద్వారా విషయం బయటకు పొక్కింది. అంటే దాదాపు 400 కిలోల బంగారాన్ని ఎందుకు తక్కువగా చూపారు అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. తమిళనాడులో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి తిరుపతిలోని టిటిడి ట్రెజరీకి బంగారం తీసుకుని వాహనం బయలుదేరటమే అనుమానస్పదంగా ఉంది.

ఎందుకంటే, బ్యాంకు దగ్గర బయలుదేరినపుడు సరైన పత్రాలు లేవు. తీసుకెళుతున్న బంగారాన్ని ఎవరికి అందివ్వాలనే విషయంలో కూడా పత్రాలు లేవు. పైగా బంగారాన్ని తీసుకెళుతున్న వాహనానాకి సరైన భద్రత కూడా లేదు.  పట్టుబడిన బంగారంపై ఇటు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు కానీ అటు టిటిడి ఉన్నతాధికారులు కానీ పొంతన లేని సమాధానాలే ఇస్తున్నారు. దాంతో అందరిపైనా అనుమానాలు పెరిగిపోతున్నాయి.

జగన్ మీడియా కథనాల ప్రకారం పట్టుబడిన బంగారం అసలు టిటిడిదే కాదట. ఎవరిదో ఓ ప్రముఖుడికి చెందిన బంగారం తమిళనాడు నుండి ఏపిలోకి వస్తోంది. ఎవరైనా పట్టుకుంటే టిటిడిదని చెప్పేట్లుగా ముందే ప్లాన్ చేసుకున్నారట. వాహనం ఎక్కడా పట్టుబడకుండా ఉంటే తిరుపతి మీదుగా కడప జిల్లాలోని ఒంటిమిట్టకు చేరుకునేదని అనుమానాలున్నాయి. నిజంగానే వాహనం గనుక ఒంటిమిట్టకు చేరుకుని ఉండుంటే బంగారం లేదు, టిటిడి లేదు. అంతా మిథ్యే.