Who Will Decide Cinema Budget : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్లకు పైగా నిర్మాణ వ్యయం అయ్యే సినిమాలకు తొలి పది రోజులు ప్రత్యేక వెసులుబాట్లు ఇస్తామని చెబుతోంది ఇటీవల విడుదల చేసిన కొత్త జీవో ద్వారా. ఎలాగైతేనేం, టిక్కెట్ల వివాదానికి ముగింపు పడిందంటూ పండగ చేసుకుంటున్న పరిశ్రమ జనాలు, కాస్త తీరిగ్గా ఆ జీవోలోని అంశాల గురించి చర్చించుకోవడం షురూ చేశాక, వాళ్ళకి అసలు విషయం అర్థమవుతోంది.
అసలు 100 కోట్లపైన నిర్మాణ వ్యయం.. అంటే, దాన్ని ఎలా లెక్కిస్తారు.? ఎవరు దాన్ని లెక్కలతో సహా చూపిస్తారు.? అన్నదే కీలకం ఇక్కడ. హీరో, హీరోయిన్లు, దర్శకుల రెమ్యునరేషన్ కాకుండా.. అని షరతు విధించింది వైఎస్ జగన్ సర్కారు. నిజానికి, ఇదొక వింత షరతుగానే చెప్పుకోవాలి.
దర్శకుడు, నటీనటులు ఎలాగైతే రెమ్యునరేషన్ తీసుకుంటారో, ఇతర టెక్నీషియన్లు కూడా అంతే. షూటింగుల అనుమతులకు సంబంధించి కూడా ప్రభుత్వాలకి చెల్లించాల్సినవి కొన్ని వుంటాయి. చెప్పుకుంటూ పోతే కథ చాలానే వుంటుంది.
‘కేవలం నిర్మాణ వ్యయం’ అంటే, దానర్థమేంటో ఎవరికీ అర్థం కావడంలేదు. హీరో, హీరోయిన్లు, దర్శకులే కాదు.. ఒక్కోసారి క్యారెక్టర్ ఆర్టిస్టులకీ పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాలి. స్పెషల్ సాంగ్స్ సంగతి సరే సరి. సినిమాటోగ్రాఫర్లు, కొరియోగ్రాఫర్లు.. ఇది వేరే కథ మళ్ళీ.
ఇవన్నీ ఆలోచిస్తే, నిర్మాణ వ్యయం ఏ కోణంలో ప్రభుత్వానికి లెక్క ప్రకారం చూపాలన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే నిర్మాతలకి.