(శ్రవణ్ బాబు)
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని 10 రోజుల సమయం కూడా లేదు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఏపీ ఎన్నికలు మొదటి విడతలోనే ఉండటంతో అతి తక్కువ సమయమే మిగిలిఉంది. అభ్యర్థుల ఎంపికలో పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. ఏపీలో ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యే ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. జనసేన పోటీలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి, ఇతర వనరుల రీత్యా మిగిలిన పార్టీలతో పోలిస్తే అది కాస్త వీక్ గానే ఉందని చెప్పుకోవాలి. మరి రెండు ప్రధాన పార్టీలలో ఏ పార్టీ గెలుస్తుంది, నెక్స్ట్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేది ఎవరు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఏపీలో రాజకీయం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
ఇబ్బడి ముబ్బడిగా ప్రజలకు గుప్పించిన సంక్షేమ పథకాలు, తన అనుభవమే తనకు శ్రీరామరక్ష అని చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. పవన్ జనసేన వలన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని ఆయన తెగ సంబరపడి పోతున్నారు. అటు వైసీపీ చూస్తే, టీడీపీ పాలనలో తీవ్రంగా పెరిగిన అవినీతి, తాను ప్రకటించిన నవరత్న హామీలు తనను గద్దెనెక్కిస్తాయని జగన్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో మద్దతిచ్చిన పవన్, బీజేపీ ఈసారి టీడీపీవైపు లేరుకాబట్టి తమ గెలుపు నల్లేరు మీద నడకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణేమో మార్పుకోరే యువత తనకు పట్టం కడుతుందని నమ్మకం పెట్టుకున్నారు.
నేతల సంగతి అలా ఉంటే, ప్రజలు మాత్రం తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది, ఏ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు అనేది అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. ముందెన్నడూ లేనివిధంగా ఏపీలో ప్రధాన పార్టీలు రెండూ ఢీ అంటే ఢీ అనేటట్లుగా ఉండటమే దీనికి కారణంగా చెప్పొచ్చు.
మనిషికి ఏదైనా సమస్య వస్తే… మానవ ప్రయత్నం ఎంత చేసినా పరిష్కారం కానప్పుడు దైవం వైపు చూసినట్లుగానే, ఈ ఎన్నికలు రాగానే అందరి దృష్టీ జ్యోతిష్కులవైపు మళ్ళుతుంది. హేతువాదులు ఎంత వాదించినా జ్యోతిష్యం అనేదికూడా ఒక సబ్జెక్ట్ అనేది ఒప్పుకుని తీరాలి. ఈ శాస్త్రంలో నైపుణ్యం ఉన్నవారు ఒక మనిషిని చూడకుండానే అతని జాతకంద్వారా ఆ వ్యక్తి గుణగణాలు, జీవితంలో ముఖ్య సంఘటనలు చెప్పగలుగుతారన్న విషయం తెలిసిందే. ఏదో ఆషామాషీగా కాకుండా… స్ట్రక్చర్డ్ గా ఉన్న ఒక సబ్జెక్ట్ ఆధారంగా మనిషి భూత, భవిష్యత్ కాలాలను చెప్పే ఈ శాస్త్రాన్ని ఒక సైన్స్ అని ఒప్పుకుని తీరాలి. కాకపోతే ఒక అన్నిరంగాలలో ఉన్నట్లే ఈ రంగంలోకూడా చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే ప్రబుద్ధులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. హేతువాదులు వారిని చూసి జ్యోతిష్య శాస్త్రం మొత్తం బూటకమని అనటంకూడా కరెక్ట్ కాదు. నూటికి నూరుపాళ్ళూ భవిష్యత్తును ప్రిడిక్ట్ చేస్తారని చెప్పలేముగానీ మంచి జ్యోతిష్కుడు ఒక వ్యక్తి జాతకంలో రాబోయే మార్పులను ముందే పసిగట్టగలుగుతాడనేది వాస్తవం. ఈ శాస్త్రం ద్వారా జాతకుడికి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసినపుడు, సదరు వ్యక్తి తన వైఖరిని మార్చుకోవటంతోబాటు కొన్ని పరిహారాలు చేసుకుని ప్రమాదాలు నివారించొచ్చనికూడా జ్యోతిష్కులు చెబుతారు. అయితే, జ్యోతిష్కులు పుల్వామాదాడిని ముందే పసిగట్టి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయొచ్చుకదా అని కొందరు ఈమధ్య వితండ వాదన చేస్తున్నారు. ఇది తర్కానికి నిలబడే వాదనకాదు.
ఇక అసలు విషయానికొస్తే ఏపీలో ముఖ్యమంత్రి పదవిని అలంకరించబోయే వ్యక్తి విషయంలో జ్యోతిష్కులు ఏమంటున్నారో ఒక్కసారి పరిశీలిద్దాం. చెన్నైకు చెందిన ఒక జ్యోతిష్కుడు రంగరాజన్ చంద్రబాబు నాయుడు మళ్ళీ గద్దెనెక్కటం ఖాయమని చెబుతున్నారు. ఆయన జాతంకలో చంద్రుడు, సూర్యుడు, కుజుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నారని, రాహువు బలమైన స్థానంలో ఉన్నాడని, ఈ కారణాలన్నింటిరీత్యా మరోసారి బాబు గెలిచి తీరతాడని అంటున్నారు. కానీ దీనికి విరుద్ధమైన వాదనలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. నెట్ లో దొరికే డేటాఫ్ బర్త్ ఆధారంగా జ్యోతిష్కులు ఈ లెక్కలు వేస్తుంటారని, నెట్ లోని జనన సమయం కరెక్ట్ కాదని అంటుంటారు. చంద్రబాబు డేటాఫ్ బర్త్ ఏప్రిల్ 20 అని పలుచోట్ల కనబడుతుంటుందని, కానీ అది కరెక్ట్ కాదన్నది వీరి వాదన.
రంగరాజన్ వీడియో లింక్ :
మరోవైపు కరీంనగర్ ప్రాంతంలోని ధర్మపురి పుణ్యక్షేత్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ(www.onlinejyotish.com) ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి తీరుతారని బలంగా చెప్పారు. సొంతంగానే జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని అంటున్నారు. ఈయన గతంలో… తెలంగాణ విభజన జరుగుతుందని, జగన్ సొంత పార్టీ పెడతాడని 2010లోనే ఒక న్యూస్ ఛానల్ ఫోన్ ఇన్ లో ఖరాఖండిగా చెప్పారు(వీడియో లింక్ కింద చూడండి). అవన్నీ తదనంతరకాలంలో నిజమైన సంగతి తెలిసిందే. కేసీఆర్ మళ్ళీ రెండోసారికూడా గెలుస్తారని రెండేళ్ళ క్రితమే ఈయన చెప్పారు.
సంతోష్ కుమార్ శర్మ వీడియో లింక్:
అయితే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సమయానికి బుధమహాదశ ఉంటుందని, బుధుడు ఆయనకు అనుకూలుడు కాదని, దీనివలన మంచి ఫలితాలు రాకపోవచ్చనికూడా కొందరు జోస్యులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ కు కూడా అవకాశముందని భవానీ శంకర్ అనే ప్రముఖ జ్యోతిష్కుడు చెబుతున్నారు. ఆయనకు 2018 అక్టోబర్ నుంచి ఒక ఏడాదిపాటు టైమ్ బాగుంటుందని అన్నారు. ఆయన డేటాఫ్ బర్త్ నెట్ ప్రకారం 1972 సెప్టెంబర్ 2 అని, ఒక వేళ అది నిజం కాకపోయినా జనసేన పార్టీ జాతకం తీసుకున్నాకూడా అదీ బాగుందని చెప్పారు. 2018 మార్చి 21 నుంచి జనసేనకు శుక్రమహాదశ ప్రారంభమైందని, 20 ఏళ్ళపాటు ఈ మహాదశ ఉంటుందని తెలిపారు. గురుడు లాభంలో ఉండటం వలన పవన్ ప్రభావం గణనీయంగానే ఉంటుందని చెప్పారు.
భవానీశంకర్ వీడియో లింక్ :
2014 ఎన్నికల్లో టీడీపీకి, వైసీపీకి నమోదైన ఓట్లశాతంలో తేడా చాలా కొద్దిగానే ఉన్నసంగతి తెలిసిందే. అదికూడా టీడీపీకి, బీజేపీ, జనసేన మద్దతు ప్రకటించిన తర్వాత. కాబట్టి జ్యోతిష్కులు ఏమంటున్నారంటే బాబు, జగన్, పవన్ మొదలైన ప్రధాన నాయకుల జాతకాలు బాగున్నాకూడా ఈ ఎన్నికల తతంగంలో నామినేషన్ వేయటం, ప్రచారాన్ని ప్రారంభించటం వంటి ముఖ్య ఘట్టాలను మొదలుపెట్టే సమయాలు(ముహూర్తాలు) కూడా వారి గెలుపులో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. లౌకికంగా ఆలోచించినాకూడా ఆయా నేతలు తమ పార్టీలకు అభ్యర్థులను ఎంపిక చేయటంలో, పోల్ మేనేజిమెంట్ చేయటంలో అనుసరించే వైఖరికూడా కీలకమన్న సంగతి తెలిసిందే. 2014లో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో చేసిన పొరపాట్లు నాడు ఆయన పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటన్నది విదితమే. అలాగే 2018 డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రచారం కారణంగా ఆఖరి 15 రోజుల్లో సీన్ అంతా మారిపోయి కేసీఆర్ కు అనుకూల వాతావరణం ఏర్పడటం అందరమూ చూశాం. కాబట్టి ప్రధాన నేతలు తీసుకునే నిర్ణయాలు, వారి వైఖరినిబట్టి పరిస్థితులు మారిపోయే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మరి ఈసారి ఈ నేతలు ఎలా వ్యవహరిస్తారనేదానిపై వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు.
(శ్రవణ్ బాబు, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్ పోన్ నెం.9948293346)