జగన్ వర్సెస్ లోకేష్.! ఎవరికి మాట్లాడటం చేతకాదు.?

రాష్ట్రంలో ఎక్కడ విన్నా ఇదే టాపిక్.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాట్లాడటం చేతకాదా.? నారా లోకేష్‌కి మాట్లాడటం చేతకాదా.? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగులో మాట్లాడటంలో చాలా చాలా ఇబ్బంది పడతారు. అది బహిరంగ రహస్యం. మాటలు మాట్లాడే క్రమంలో తెలియకుండా బూతులొచ్చేస్తాయ్.

బూతులంటే, బూతులు మాట్లాడాలని మాట్లాడడు.. ఏదో అనాలనుకుంటే, ఇంకోటేదో అవుతుంటుంది. జయంతికీ, వర్ధంతికీ తేడా తెలియకుండా మాట్లాడుతుంటారు నారా లోకేష్. రాజకీయ నాయకుల్లో చాలామందికి ఈ సమస్య వుంటుంది.

ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడిన వైఎస్ జగన్, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం తడబడుతూనే వున్నారు. ఏదన్నా బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడితే చాలు.. అందులోంచి బోల్డు తప్పులు బయటకు వస్తుంటాయి.

లోకేష్ ‘యువగళం పాదయాత్రలో’ మాట తడబడటంపై వైసీపీ శ్రేణులు విపరీతంగా ట్రోల్ చేశాయి. దానికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ టీడీపీ శ్రేణులు అంతకన్నా దారుణంగా, వైఎస్ జగన్ తడబాటుని ట్రోల్ చేయడం జరుగుతోంది.

వెరసి, అటు వైఎస్ జగన్.. ఇటు నారా లోకేష్.. ఇద్దరూ తప్పులకి దొరికేశారు. మాట ఎవరికైనా తడబడుతుంది. సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయమూ వైరల్ అవుతుంది గనుక.. తప్పించుకోవడం కష్టం.

ఇద్దరికీ మాట్లాడటం చేతకాదా.? అంటే, చేతకాదని ఎవరు మాత్రం అనగలరు.? ఒకర్ని ఒకరు ట్రోల్ చేసుకుంటున్న దరిమిలా, ఇద్దరికీ మాట్లాడటం చేతకాదన్న అభిప్రాయం జనాల్లోకి వెళుతోంది.