మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి వెనుకాల ఎవరున్నారు.? ఆయన రెబల్ ఎమ్మెల్యేగా మారడం వెనుక కీలక పాత్ర పోషించిందెవరు.? ఈ విషయమై ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
నెల్లూరు జిల్లాలో ‘పెద్దారెడ్డి’ అనే స్థాయి ఆనం రామనారాయణరెడ్డికి వుంది. ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి మాస్ లీడర్. ఒకప్పుడు ఆనం బ్రదర్స్ అంటే.. నెల్లూరు జిల్లాలో బోల్డంత పలుకుబడి. ఆనం వివేకా మరణంతో, సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి ఒంటరి అయ్యారు.
వైసీపీ వేవ్‌లో ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి దక్కాల్సిందేగానీ, ఆయనే అద్భుతమైన అవకాశాల్ని చెడగొట్టుకున్నారు. వైసీపీలో మొదటి నుంచీ ఆనం రామనారాయణరెడ్డిది వివాదాస్పద వైఖరే. కాకపోతే, సీనియర్ నేత.. అన్న కోణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్.. జరుగుతున్న పరిణామాల్ని చూసీ చూడనట్లు వదిలేశారు.
కానీ, అనూహ్యంగా ఆనం రామనారాయణరెడ్డి స్వరం పెంచారు.. రెబల్‌గా మారిపోయారు. ‘నేనేం తప్పు మాట్లాడానని.?’ అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. ‘మళ్ళీ అధికారంలోకి రావడం కష్టం..’ అన్న మాట ఒక్కటీ చాలదా, ఆనం రామనారాయణరెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపడానికి.? అన్నది వైసీపీలో చాలామంది చెబుతున్నమాట.
‘ఇన్నాళ్ళూ జగన్ ఉపేక్షించి తప్పు చేశారు..’ అన్న మాటే వైసీపీలో ప్రముఖంగా వినిపిస్తోంది ఆనం విషయమై. జనసేన వైపు ఆనం వెళతారట. చంద్రబాబు సైతం ఆనంతో మంతనాలు షురూ చేశారని అంటున్నారు. ఇంతకీ, ఆనం వెనుక వున్నదెవరు.? చంద్రబాబు.. పవన్.. ఇద్దరూ వున్నారని అనుకోవాలేమో.!