వంగవీటి రాధా కి ఎవరు సలహాలిస్తున్నారు?

వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధా పొలిటికల్ కెరీర్ సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ అయినా.. అనంతరం ఎందుకో స్థిరత్వం లేకుండా సాగుతుంది! అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాల ఫలితమో.. లేక, ఆవేశంగా వేస్తున్న అడుగుల ప్రతిఫలమో కానీ… 2004 అనంతరం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన పొలిటికల్ కెరీర్ ను పతనావస్తలోకి తీసుకుపోతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

2004లో కాంగ్రెస్ తరఫున తొలిసారి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న వంగవీటి రాధా కెరీర్ కు వైఎస్సార్ భరోసా ఇచ్చారు. విజయవాడ కాంగ్రెస్ లో తనకు ప్రత్యేక స్థానం ఇచ్చే ప్రయత్నాలు చేశారు. ఇంతలోనే ఎవరు సలహా ఫలితమో కానీ.. ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు రాధా. అనంతరం జరిగిన ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిపోయారు!

అలా రాజకీయంగా స్థబ్ధగా ఉన్న రాధా… కొన్నాళ్లకు వైసీపీలో చేరారు. 2014లో ఆ పార్టీ సింబల్ పై సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ.. రిజల్ట్ సేం.. మళ్లీ ఓటమి! ఈ క్రమంలో 2019 ఎన్నికలకు వచ్చే సరికి సెంట్రల్ నియోజకవర్గం సీటు విషయంలో రచ్చ జరిగింది. తనకు సెంట్రల్ టికెట్ కావాల్సిందేనని రాధా పట్టుబట్టడం.. అది తప్ప ఏదైనా ఇస్తానని జగన్ చెప్పడం.. అనంతరం అలిగిన రాధా.. ఎవరి సలహా ఫలితమో కానీ… టీడీపీలో చేరిపోవడం జరిగిపోయాయి. అక్కడ అప్పటికే కాపు సామాజికవర్గానికి చెందిన బోండా ఉమ ఉండటంతో.. అక్కడ కూడా ఒరిగిందేమీ లేక, సైలంట్ గానే ఉండాల్సిన పరిస్థితి!

టీడీపీలో చేరినా కూడా విజయవాడ సెంట్రల్ సీటు దక్కదని పునరాలోచనలో పడిన రాధా.. మరెవరి సలహాతోనో – ఇప్పుడు జనసేనలో చేరబోతున్నారంట. అవును.. ఈ నెల 22న ఉగాది సందర్భంగా రాధా.. జనసేన తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. విచిత్రం ఏమిటంటే… ఇప్పుడు రాధా జనసేనలో చేరినా – టీడీపీలో ఉన్న సీటు విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదు!

జనసేన – టీడీపీ కలిసే ఎన్నికలకు వెళ్లబోతునాయని కథనాలొస్తున్న తరుణంలో… పొత్తులో కూడా ఈ విజయవాడ సెంట్రల్ సీటు జనసేనకు వచ్చే పరిస్థితి లేదనేది విశ్లేషకుల మాట. బోండా ఉమని కాదనుకుని చంద్రబాబు.. ఆ సీటు జనసేనకు ఆఫర్ చేస్తారనుకోవడం రాజకీయ అజ్ఞానమే అనేది వారి మాట! దీంతో తెగ ఫీలయిపోతున్న రాధా ఫ్యాన్స్… అసలు రాధాకి ఎవరు సలహాలిస్తుంటారు? ఆయన ఎవరి సలహాల మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అని డిస్కషన్స్ చేసుకుంటున్నారు.