పవన్ కళ్యాణ్ ‘వారాహి’ ఎక్కడ.? ఏం చేస్తోంది.?

‘వారాహి’ వాహనాన్ని యుద్ధ శకటంగా చూపించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కల్లోలానికి ప్లాన్ చేసింది జనసేన పార్టీ. రాజకీయ పార్టీలకు ప్రచార వాహనాలు కొత్తేమీ కాదు. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత వింతగా ఆలోచించారు. అది ఆయనిష్టం.

సరే, ప్రచార వాహనమైతే సిద్ధమయ్యింది. కానీ, ఆ ప్రచార వాహనం మీద జనంలోకి వెళ్ళాల్సిన జనసేనాని ఎక్కడ.? అదే అసలు సమస్య. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్, సినిమాల్లో బిజీగా వున్నారు. రాజకీయాలకు సమయం కేటాయించలేనంత బిజీ అయిపోయారాయన. దాంతో, ‘వారాహి’ వాహనానికి పని లేకుండా పోయింది. దాంతో, వారాహి మీద సోషల్ మీడియా వేదికగా రకరకాల సెటైర్లు పడుతున్నాయి.

‘వారాహి’ వాహనాన్ని, సినిమా షూటింగుల్లో కారవాన్‌లా వాడుతున్నారనే ఆరోపణలే కాదు, మొబైల్ టాయిలెట్లలా కూడా వాడేస్తున్నారంటూ కామెంట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

మొన్నామధ్యన పవన్ కళ్యాణ్ ఆ వాహనం మీదనే, మచిలీపట్నంలో హంగామా చేసిన సంగతి తెలిసిందే. అభిమానుల సందోహం నేపథ్యంలో, మధ్యలోనే వారాహి వాహనం నుంచి దిగి, కారులో సభా ప్రాంగణానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కినా, ‘నాకేంటి సంబంధం.?’ అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు.

జనసైనికులు మాత్రం, ‘వారాహి వస్తుంది.. ఆ చక్రాల కింద వైసీపీ, టీడీపీ నలిగిపోతాయ్..’ అంటున్నారు. ముందైతే, వారాహి.. రాష్ట్ర రాజకీయాల్లో తిరగాలి.. ఆ తర్వాతే కదా, ఎవరు నలిగిపోతారో తెలుస్తుంది.!